హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... నగరవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ... ఏకంగా 474 మంది పట్టుబడ్డారు. వీరిలో అత్యధికంగా 417 మంది టూ వీలర్ వాహనదారులు ఉండగా... 24 మంది త్రీ వీలర్, 33 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అత్యధికంగా 188 కేసుల్లో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (BAC) లెవెల్స్ 51 నుంచి 100 లోపు ఉండగా... మరో 12 మంది డ్రైవర్లు అయితే ఏకంగా 300కు పైగా BAC స్థాయితో వాహనాలు నడుపుతూ దొరికారు.
జీరో టాలరెన్స్ విధానంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని... డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
