
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం చేసిన కులగణన ప్రకటన "గేమ్ చేంజర్" నిర్ణయం అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. ఇది మోదీ ప్రభుత్వ నిజమైన ఉద్దేశాలకు, కాంగ్రెస్ అబద్ధపు నినాదాలకు మధ్య వ్యత్యాసాన్ని బయటపెట్టిందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
"కాంగ్రెస్ రాజకీయాలు ఎల్లప్పుడూ కుటుంబ పాలన, అధికారం చుట్టూ తిరుగుతాయి. వెనుకబడిన తరగతుల హక్కులు లేవనెత్తినప్పుడల్లా వారు అసౌకర్యంగా ఫీలయ్యేవారు. ఎందుకంటే వారు సామాజిక న్యాయం గురించి నిజంగా ఎప్పుడూ పట్టించుకోలేదు" అని ప్రధాన్ ఆరోపించారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో సామాజిక న్యాయం లక్ష్యాన్ని అడ్డుకుందని దుయ్యబట్టారు.
బీజేపీ.. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా సామాజిక న్యాయం ఎజెండాగా నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ.. కేంద్రం, రాష్ట్రాలు సహా వివిధ స్థాయిలలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు వంటి కీలక పదవులలో అణగారిన వర్గాలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ప్రధాన్ అన్నారు.
కులగణన నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదని, 'సబ్కా సాత్, సబ్కా వికాస్' అనేది మోదీ ప్రభుత్వానికి మార్గదర్శక దృక్పథమని ఆయన నొక్కి చెప్పారు. "మా అన్ని కార్యక్రమాలు, పథకాల లక్ష్యం సామాజిక న్యాయం. సమాజంలోని అన్ని వర్గాలకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం మా లక్ష్యం" అని ప్రధాన్ పేర్కొన్నారు.