లాలూ ఫ్యామిలీపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

లాలూ ఫ్యామిలీపై  సీబీఐ చార్జిషీట్ దాఖలు

బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల కుంభకోణంలో వీరిపై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో  సీబీఐ చార్జిషీటును సమర్పించగా.. ఈ నెల 12న విచారణ చేపట్టనుంది.  

2004 -2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ డి స్థానాల్లో వివిధ వ్యక్తులను నియమించారని, దానికి బదులుగా సంబంధిత వ్యక్తులు తమ భూమిని లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఏజెన్సీలు ఆరోపించాయి. 

ఈ నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదా పబ్లిక్ నోటీసు జారీ చేయలేదని, అయితే ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో పాట్నా నివాసితులు కొంతమందిని ప్రత్యామ్నాయంగా నియమించారని సీబీఐ తన ఫిర్యాదులో ఆరోపించింది.  

ఈ కేసుకు సంబంధించి లాలూ, రబ్రీదేవీలను సీబీఐ మార్చి నెలలో ప్రశ్నించింది. సీబీఐ గతేడాది దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో లాలూ దంపతులతో పాటు వారి కుమార్తె మిసా భారతి పేరు కూడా ఉంది. ఈ కేసులో ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌తో పాటు పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది.