
న్యూఢిల్లీ, వెలుగు: నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) సీబీఐ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు వచ్చిన నేతలిద్దరూ.. అక్కడి నుంచి సీజీఓ క్లాంప్లెక్స్ ఏరియాలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సాక్షులుగా హాజరైన వీళ్లిద్దరినీ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. ఒక ఐపీఎస్, ఇద్దరు సీఐలతో కూడిన బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. వీళ్లిద్దరినీ వేర్వేరుగా, నిందితుడితో కలిపి విచారించి స్టేట్ మెంట్లు రికార్డు చేసింది. ముఖ్యంగా శ్రీనివాస్ తో ఉన్న సంబంధం ఏంటి? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. శ్రీనివాస్ ఫోన్లో దొరికిన పలు ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల గురించి అడిగినట్లు సమాచారం. ఇటీవల మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాస్‌ను ఎందుకు సన్మానించారని, గ్రానైట్ అసోసియేషన్ నుంచి విలువైన గిఫ్టులను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది.
రెండుసార్లు కలిశాం: గంగుల
శ్రీనివాస్ తమకు కేవలం మున్నురు కాపు బిడ్డగా, ఐపీఎస్ అధికారిగా మాత్రమే తెలుసునని గంగుల తెలిపారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీనివాస్‌ను వారం కింద మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో కలిశాం. కేవలం రెండుసార్లు మాత్రమే ఆయనను కలిశాం. ఆయనతో ఎలాంటి లావాదేవీలు చేయలేదు. మేం ఎలాంటి తప్పు చేయలేదు” అని గంగుల చెప్పారు. అధికారులు విచారణకు మళ్లీ రమ్మనలేదని తెలిపారు. మున్నూరు కాపు వ్యక్తిగానే శ్రీనివాస్ పరిచయమని, ఆయన దగ్గరున్న గోల్డ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని రవిచంద్ర చెప్పారు.
సీబీఐ శ్రీనివాస్‌గా ఫేమస్..
నకిలీ సీబీఐ ఆఫీసర్ కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న శ్రీనివాస్.. బెయిల్ పిటిషన్ వేయాలని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వైజాగ్‌లోని ఆయన ఫ్రెండ్స్ గురువారం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీనివాస్ వైజాగ్ లోని సీబీఐ టౌన్లో చాలా రోజులు రైస్ బిజినెస్ చేశాడు. అందుకే ఆయనను అందరూ సీబీఐ శ్రీనివాస్ అని పిలిచేవారు. పది రూపాయల వడ్డీకి వ్యాపారం చేసేవాడు. ఏడాదిన్నర కాలంగా వైజాగ్, ఢిల్లీ, హైదరాబాద్‌కు తిరుగుతున్నాడు” అని వాళ్లు చెప్పారు. ఇంగ్లిష్‌లో తన పేరు కూడా సరిగా రాయలేని శ్రీనివాస్.. హిందీలో బాగా మాట్లాడతాడని తెలిపారు. గతంలో తమను వద్దిరాజు రవిచంద్ర దగ్గర దావత్‌కు రమ్మని పిలిచాడని, కానీ తాము వెళ్లలేదని పేర్కొన్నారు.