చందా కొచ్చర్ కు షాక్: దేశం దాటకుండా లుక్ ఔట్ నోటీస్

చందా కొచ్చర్ కు షాక్: దేశం దాటకుండా లుక్ ఔట్ నోటీస్

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ కు సీబీఐ షాక్ ఇచ్చింది. వీడియోకాన్ కంపెనీకి అక్రమంగా రూ.3250 కోట్ల లోన్ ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె దేశం వదిలి వెళ్లిపోకుండా కట్టడి చేసింది. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల ఇమిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేసింది. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈ విషయాన్ని అన్ని విమానాశ్రయాలకు తెలియజేసింది.

వీడియో కాన్ ఎండీ వేణు గోపాల్ ధూత్ కు లోన్ ఇవ్వడం కోసం నిబంధనలను ఉల్లంఘించినట్లు గతంలో బయటపడడంతో చందా కొచ్చర్ ను ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. అంతకు ముందే సీబీఐ ఆమెపై, భర్త దీపక్ కొచ్చర్, వేణు గోపాల్ ధూత్ ల ఇళ్లు కార్యాలయాలపై దాడులు చేసి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. చందా కొచ్చర్ భర్త దీపక్ కంపెనీల్లో వేణు గోపాల్ పెట్టుబడులు పెట్టడం కోసమే అక్రమంగా లోన్లు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చందా కొచ్చర్ పై విచారణ జరుగుతున్న క్రమంలో ఆమె దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు లుక్ ఔట్ నోటీసులను జారీ చేసింది సీబీఐ.