- నోటీసులపై స్కాన్ చేస్తే గుట్టురట్టు
- ఏఐ ఆధారిత చాట్ బాట్ రూపకల్పన
- వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న కోడ్
హైదరాబాద్, వెలుగు: సీబీఐ, ఈడీ, కస్టమ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న డిజిటల్ అరెస్టులకు సీబీఐ అడ్డుకట్ట వేసింది. నకిలీ నోటీసులు, సమన్లను గుర్తించేలా క్యూఆర్ కోడ్‌ను రూపొందించింది. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్ ‘అభయ్’ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు సీబీఐ జారీ చేసే నోటీసులు, సమన్లపై ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను రూపొందిస్తోంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారులమని చెబుతూ నకిలీ నోటీసులు ఇచ్చి డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఆ మోసాలను అడ్డుకోవడం అభయ్ ప్రధాన లక్ష్యం. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ వివరాలు వెల్లడించారు.
నకిలీ నోటీసులకు చెక్ పెట్టేలా
దేశంలో సంచలన కేసులు, ఆర్థిక నేరాలు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసుల్లో నిందితులకు సీబీఐ నోటీసులు జారీచేసే విధానం అమల్లో ఉంది. విచారణకు హాజరు కావాల్సిన తేదీ, సమయం సహా పూర్తి వివరాలు ఆయా నోటీసుల్లో పేర్కొంటారు. కాగా.. ఇలాంటి నోటీసులు నిజమైనవా లేక నకిలీ నోటీసులా అనేది గుర్తించడం సమస్యగా మారింది. దీన్నే సైబర్ నేరగాళ్లు అవకాశంగా చేసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు సహా వివిధ రకాల సైబర్ నేరాల్లో అమాయకులకు నకిలీ నోటీసులు పంపించి డిజిటల్ అరెస్టుల పేరుతో భయాందోళనలకు గురిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ఇలాంటి డిజిటల్ అరెస్టులను నివారించడంలో భాగంగా సీబీఐ క్యూఆర్ కోడ్ రూపొందించింది.
‘అభయ్’ ఇలా పనిచేస్తుంది
ప్రతి నోటీసుపై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ‘అభయ్’ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను సీబీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఏదైనా కేసులో నోటీసులు అందినప్పుడు ఏఐ చాట్‌బాట్ ‘అభయ్’ లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిర్ధారించుకోవడానికి ఏఐ అభయ్ ఏజెన్సీ డేటాబేస్‌ను తనిఖీ చేస్తుంది. నిజమైన నోటీసులైతే విచారణ తేదీ సహా పూర్తి వివరాలు సీబీఐ వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. దీంతో నిజమైన నోటీసో, కాదో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ విధానంతో నకిలీ సమన్లు, ఫేక్ ఫోన్ కాల్స్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తపడవచ్చని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

