లిక్కర్ స్కాంలో ఐదుగురు నిందితులు

లిక్కర్ స్కాంలో ఐదుగురు నిందితులు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్​ను విచారణకు స్వీకరించడంపై 28న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది.  శనివారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో జడ్జి నాగ్ పాల్ ముందు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ మట్ట సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. శుక్రవారం దాఖలు చేసిన 13,567 పేజీల ఈ చార్జ్ షీట్​లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు మోపినట్లు వివరించారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జడ్జి నాగ్ పాల్.. సప్లిమెంటరీ చార్జ్ షీట్​ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 28న విచారణ జరుపుతామని వెల్లడించారు. అలాగే, శరత్ చంద్రా రెడ్డి బెయిల్ పిటిషన్​ విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. నిరుడు నవంబర్ 26న ఈడీ దాఖలు చేసిన తొలి చార్జ్ షీట్​లో మహేంద్రును ఏ1గా, ఏ2, ఏ3, ఏ4, ఏ5 గా ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీలను చేర్చింది. దీంతో రెండు చార్జ్ షీట్ లు కలిపి ఈడీ ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు వ్యక్తులు,11 కంపెనీలపై అభియోగాలు మోపినట్లైంది. దీంతో నిందితుల సంఖ్య 17 కు చేరింది.

నిందితులకు మరో 21 రోజుల జుడిషీయల్ కస్టడీ

లిక్కర్ స్కాంలో అరెస్టైయిన అభిషేక్, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్​కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మరో 21 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగించింది. లిక్కర్​స్కాంలో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన ఈ నలుగురు నిందితులు తిహార్ జైళ్లో ఉన్నారు. గతంలో కోర్టు ఈ నలుగురికి విధించిన జ్యుడిషీయల్ రిమాండ్ శనివారంతో ముగిసింది.