అమిత్ షా ఫేక్ వీడియో కేసు .. పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి

అమిత్ షా ఫేక్ వీడియో కేసు ..  పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త అరుణ్ రెడ్డిని పటియాలా కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. శుక్రవారం రాత్రి జడ్జి ఇంట్లో ఆయన ముందు ప్రొడ్యూస్ చేశారు. రిజర్వేషన్ల విషయమై అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడంలో అరుణ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పోలీసులు జడ్జికి వివరించారు. 

మరింత సమాచారం రాబట్టేందుకు అరుణ్​ను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీంతో అరుణ్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు అరుణ్ రెడ్డిని విచారణ కోసం తరలించారు. సాక్ష్యాలు ధ్వంసం చేసే అవకాశం ఉండటంతో అతని ఫోన్​ను పోలీసులు సీజ్ చేశారు. కాగా, ప్రస్తుతం అరుణ్ రెడ్డి.. ‘స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్’ హ్యాండ్లర్ గా, కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నారు.