సీబీఎస్ ఈ12వ తరగతి ఫలితాలు రిలీజ్..తెలంగాణ విద్యార్థులు 92.24 %  మంది పాస్ 

సీబీఎస్ ఈ12వ తరగతి ఫలితాలు రిలీజ్..తెలంగాణ విద్యార్థులు 92.24 %  మంది పాస్ 

హైదరాబాద్, వెలుగు: సీబీఎస్​ఈ12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,426 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 10,539 (92.24%) మంది పాసయ్యారు. ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించి తమ హవాను కొనసాగించారు. బాలికలు 95.16 శాతంతో సత్తా చాటగా, బాలురు 89.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్ర విద్యార్థుల రిజల్ట్ మెరుగైందని చెప్పారు. స్కూళ్ల వారీగా చూస్తే జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి 325 మంది పరీక్ష రాయగా.. 322 (99.08%) మంది పాసై అగ్రస్థానంలో నిలిచింది.

కేంద్రీయ విద్యాలయాలు 972 ఎగ్జామ్స్​కు అటెండ్ కాగా.. 959 (98.66%) మంది ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో నిలిచాయి. సర్కారు స్కూళ్లు 93.26 శాతం, ప్రైవేట్ స్కూళ్లు 91.68 శాతం ఫలితాలు సాధించాయి. సామాజిక వర్గాల వారీగా జనరల్ అభ్యర్థులు 94.80 శాతం, ఓబీసీలు 91.20 శాతం, ఎస్సీలు 88.76 శాతం, ఎస్టీలు 88.39 శాతం మేర ఉత్తీర్ణత పొందారు. దేశవ్యాప్తంగా 19,967 స్కూళ్ల నుంచి 17,80,365 మంది 12వ తరగతికి రిజిస్ర్టర్డ్ అయ్యారు. వీరిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో జరిగిన పరీక్షలకు 17,68,968 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 15,07,109 (85.20%) మంది పాసయ్యారు.