దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించిన హిందీ చిత్రం 'ది కేరళ స్టోరీ'.. గత సంవత్సరం టీజర్‌ను విడుదల చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. మే 5న విడుదల కానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 10 సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. కేరళ మాజీ ముఖ్యమంత్రితో ముఖాముఖికి సంబంధించిన దృశ్యాలను సైతం తీసివేసినట్టు ప్రకటించింది.
తొలగించిన దృశ్యాలు
సెన్సార్ బోర్డ్ తొలగించిన సన్నివేశాల్లో హిందూ దేవతలకు వ్యతిరేకమైన కొన్ని డైలాగులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని డైలాగులు మార్చినట్టు సమాచారం. ఉదాహరణకు "భారత కమ్యూనిస్టులు అతిపెద్ద కపటవాదులు" అని చెప్పే డైలాగ్ లో నుంచి... భారత అనే పదాన్ని తొలగించారు.
ఈ సినిమాలో కేరళ మాజీ సిఎంతో ఒక టీవీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ముఖాముఖిలో సీఎం.. ఆ రాష్ట్ర యువకులు ఇస్లాం మతంలోకి మారడానికి ప్రభావితమవుతున్నారని, రాబోయే రెండు దశాబ్దాలలో కేరళ ముస్లింల మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం టీవీ ఇంటర్వ్యూను సినిమా నుంచి తొలగించాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది.
వివాదం
కేరళలోని ఇస్లామిక్ స్టేట్ (IS) టెర్రర్ గ్రూప్ ద్వారా 32,000 మంది మహిళలు రిక్రూట్ అయ్యారని, అందులో షాలినీ ఉన్నికృష్ణన్ అలియాస్ ఫాతిమా బా ఒకరని... ఓ క్యారెక్టర్‌తో కూడిన టీజర్ (నవంబర్ 2022లో విడుదలైంది) కేరళ స్టోరీ వివాదానికి దారితీసింది.
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు ఈ చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎం, కాంగ్రెస్‌లు ఈ హిందీ చిత్రాన్ని విడుదల చేయకూడదని భావించినప్పటికీ, చిత్ర ప్రదర్శనకారులు భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు.

