- మే 10 వరకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదుకు అవకాశం
- మొదటి రోజు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపు
- ప్రతి ఒక్కరూ వివరాలు ఇచ్చి దేశ నిర్మాణంలో భాగం కావాలి: కిషన్ రెడ్డి
- ప్రజల సమాచారానికి చట్టపరమైన రక్షణ ఉంటుంది: భారతి హోళికేరి
హైదరాబాద్, వెలుగు: జనగణన-2027లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు సహా పలువురు మంత్రులు ఆదివారం తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 14 రోజుల పాటు ఈ స్వీయ గణన సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా లెక్కలే అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే గణాంకాలు పక్కాగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే జనగణనలో ప్రతి పౌరుడు తన బాధ్యతగా వివరాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక అల తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు, సామాజిక, -ఆర్థిక పరిస్థితులపై స్పష్టత వచ్చేందుకు ఈ వివరాలు అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర జనాభా లెక్కల డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ.. ప్రజలు https://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా సులభంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమాచారం సమర్పించిన వెంటనే ‘స్వీయ గణన ఐడీ’ని సేవ్ చేసుకోవాలని, ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు దానిని చూపిస్తే సరిపోతుందన్నారు. సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, చట్టపరమైన రక్షణ ఉంటుందని ఆమె వెల్లడించారు.
జనగణనను విజయవంతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు డిజిటల్ పద్ధతిని వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సెన్సస్ 2027 పోస్టర్లను విడుదల చేశారు. ప్రతి కుటుంబం లెక్కలోకి రావడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
జనాభా లెక్కలు దేశాభివృద్ధికి బలమైన పునాది: కిషన్ రెడ్డి
దేశాభివృద్ధిలో జనాభా లెక్కలు ఒక బలమైన పునాది వంటివని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి కచ్చితమైన గణాంకాలే ప్రాతిపదిక అని అభివర్ణించారు. తెలంగాణ జనగణన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని, ఆయన మాట్లాడారు. మే 10 వరకు స్వీయ గణన ముగిసిన వెంటనే, మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ (హౌస్ లిస్టింగ్) కొనసాగుతుందని వివరించారు.
ప్రతి ఒక్కరూ కచ్చితమైన సమాచారాన్ని అందించి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సెన్సస్ అధికారులు సేకరించే అంశాలు అత్యంత గోప్యంగా ఉంటాయని, ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వివరాలు ఇవ్వాలని సూచించారు. స్వీయ గణన ద్వారా సమయం ఆదా కావడమే కాకుండా తప్పుల్లేని సమాచారం నమోదవుతుందని ఆయన వివరించారు.

