న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం తుది దశలో ఉందని, దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో అర్వింద్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్‌తోనూ అర్వింద్ సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను వారికి ఎంపీ అర్వింద్ వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటు, స్పైసెస్ బోర్డు నుంచి పసుపును తొలగించే అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. పీయూష్ గోయల్ తో సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని అర్వింద్ మీడియాకు చెప్పారు.
నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట నెలబెట్టుకునేలా పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పసుపు రైతుల కష్టాలు, పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలనూ పరిశీలించారని తెలిపారు. బోర్డు ఏర్పాటుపై పలు సమావేశాలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు రైతు సమస్యలపై కేంద్ర మంత్రి ఇచ్చిన అపాయింట్మెంట్ నేపథ్యంలో అర్వింద్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన నాన్నమ్మ అంత్యక్రియలకు ఆయన హాజరుకాలేకపోయారు.


