అబ్బా.. ఏందిరా సామీ ఆ కండ బలం. సినిమా హీరోలు జీపులను, విలన్లను గాలిలో ఎగరేయడం చూశాం. కానీ ఏకంగా ఏడు వందల టన్నుల బరువున్న భారీ నౌకను పళ్లతో లాగడం ఎప్పుడైనా ఊహించామా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. ఈజిప్టుకు చెందిన అష్రఫ్ మహ్రూస్ సులైమాన్ అనే వ్యక్తి తన పంటి బిగువుతో సముద్రంలో ఉండే ఒక భారీ షిప్పును అలవోకగా లాగి ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ విన్యాసం 2025 సెప్టెంబర్ 27న ఈజిప్టులోని అల్ ఘర్దకాలో జరిగింది. అష్రఫ్ లాగిన ఆ నౌక బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 720.332 మెట్రిక్ టన్నులు. అంటే వందల కొద్దీ ఏనుగుల బరువుతో సమానం అన్నమాట. ఇంతటి భారీ బరువును కేవలం తన పళ్లతో పట్టుకుని కదిలించి.. పళ్లతో లాగిన అత్యంత బరువైన నౌకగా సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇది కేవలం శారీరక బలం, పట్టుదలకు నిదర్శనమని గిన్నిస్ ప్రతినిధులు కొనియాడారు.
Heaviest ship pulled by teeth: 720.332 tons by Ashraf Mahrous Sulaiman AKA 'Kabonga' 🇪🇬
— Guinness World Records (@GWR) April 17, 2026
أثقل سفينة يتم سحبها بالأسنان: 720.332 طن، أنجزها أشرف محروس سليمان المعروف بـ "كابونجا" 🇪🇬 pic.twitter.com/7l4Vhe41No
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో అష్రఫ్ ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇలాంటి రికార్డుల కోసం ప్రయత్నించే వారికి కనీసం 16 ఏళ్ల వయస్సు ఉండాలనే నిబంధన ఉంటుంది. అష్రఫ్ తన లక్ష్యం కోసం ఏళ్ల తరబడి కఠినమైన క్రమశిక్షణతో శిక్షణ పొందాడు. దానికి తగ్గట్టే ఆ భారీ నౌకను సముద్రపు అలలపై లాగుతున్న దృశ్యాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ఒకరు కామెంట్ చేయగా, ఇది మామూలు బలం కాదు బ్రో.. అన్‌రియల్ అంటూ మరో యూజర్ కొనియాడారు.
నిజంగానే పంటితో అంత బరువును లాగడం అనేది మానవ పరిమితులకు అతీతమైన విషయం. అష్రఫ్ సాధించిన ఈ ఘనత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కండబలం ప్రదర్శించే వీరులకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. నువ్వు మనిషివి కావన్నా.. మహాబలుడివి అంటూ సోషల్ మీడియాలో అతడికి నీరాజనాలు పడుతున్నారు.

