న్యూఢిల్లీ: విమాన ప్రయాణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని పాటలు వినే ప్యాసింజర్లపై చర్యలు తీస్కోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇయర్‌ఫోన్స్ వాడకుండా మొబైల్ లేదా స్పీకర్లలో బిగ్గరగా వాల్యూమ్ పెట్టి మ్యూజిక్ వినేవారిపై తప్పకుండా చర్యలు తీస్కోవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అలాంటి ప్రవర్తనను అనైతికంగా, అసౌకర్యంగా పరిగణిస్తూ శిక్షాత్మక చర్యలు తీస్కునే అధికారం ఉంటుందని చెప్పింది.
లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సివిల్ ఏవియేషన్ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాలను వెల్లడించారు. ఏరోనాటిక్స్ రూల్స్ 1937 కింద.. విమానాల్లో అసౌకర్యం కలిగించేవారిపై చర్యలు తీస్కోవచ్చన్న నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు.
మ్యూజిక్ ప్లే చేస్తూ ఇబ్బంది కలిగించినా, ప్లేన్ సిబ్బందిని.. ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి చర్యలు తీసుకునేందుకు కొత్తగా ఎలాంటి చట్టం రావట్లేదని, డీజీసీఏ నిబంధనల ప్రకారమే తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. బోర్డింగ్ సమయంలో ఎయిర్‌లైన్స్ వినిపించే సాఫ్ట్ మ్యూజిక్‌పై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. వ్యక్తిగతంగా బిగ్గరగా సౌండ్ చేయడం, వాల్యూమ్ పెట్టడం అసలు సమస్య అని అన్నారు.
