- వరి పెట్టుబడి ఖర్చు 150% పెరిగితే.. మద్దతు ధరలో పెరుగుదల 71 శాతమే
- పత్తిదీ ఇదే పరిస్థితి.. ఆ మద్దతు ధర దక్కక రైతులకు నష్టాలు
- రాష్ట్రంలో 95 శాతం వరి–పత్తి పంటలే.. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలంటున్న నిపుణులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగు రోజు రోజుకూ ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల వ్యయం, యంత్రాల కిరాయిల ఖర్చులు విపరీతంగా పెరగడంతో గత పదేళ్లలో ఎకరాకు సాగు పెట్టుబడి దాదాపు 150 శాతం వరకు పెరిగింది. అయితే పెట్టుబడులు ఈ స్థాయిలో పెరిగినప్పటికీ, రైతులకు వచ్చే ఆదాయం మాత్రం అదే స్థాయిలో పెరగలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెట్టుబడుల పెరుగుదలకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఖర్చులు భారమవడమే కాకుండా, ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం ఇప్పుడు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వరి, పత్తి పంటలే దాదాపు 95 శాతం సాగు విస్తీర్ణాన్ని ఆక్రమిస్తున్నాయి. దాదాపు కోటి 10 లక్షల ఎకరాల్లో ఈ రెండు పంటలే సాగవుతున్నాయి. ఇతర పంటలతో పోలిస్తే శ్రమ తక్కువగా ఉండటం, ప్రభుత్వ కొనుగోలు హామీ ఉండటంతో రాష్ట్ర రైతులు ప్రధానంగా వరి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
20 వేల నుంచి 50 వేల వరకు పెరిగిన పెట్టుబడి
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2014 ప్రాంతంలో ఎకరాకు వరి సాగుకు సగటున రూ.20 వేల వరకు ఖర్చు అయ్యేది. కానీ, ప్రస్తుతం అదే ఖర్చు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు చేరింది. కూలీల వ్యయం రెట్టింపు కావడం, డీజిల్, ఎరువులు, పురుగుమందుల ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వరి మద్దతు ధర మాత్రం అదే కాలంలో కేవలం 71 శాతం మాత్రమే పెరిగిందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడి పెరుగుదలకు అనుగుణంగా మార్కెట్ ధరలు లేకపోవడంతో, రైతులకు లాభాల బదులు అప్పులే మిగులుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పసుపు, మిరప సాగుకు ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్న రైతులకు, అనుకూల మార్కెట్ ఉంటేనే కొంత లాభం కనిపిస్తోంది.
వరి ఉత్పత్తి ఖర్చు–ఎంఎస్పీ మధ్య భారీ అంతరం
వ్యవసాయ నిపుణుల లెక్కల ప్రకారం ప్రస్తుతం వరి ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాల్‌కు రూ.2,162 వరకు ఉంది. దీనికి రైతు కుటుంబ శ్రమ, ఇతర పరోక్ష ఖర్చులను కూడా కలిపితే మొత్తం ఉత్పత్తి ఖర్చు రూ.3,243 వరకు వస్తోందని నిపుణులు చెబుతున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం కలిపి ఎంఎస్పీ నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి ధాన్యం మద్దతు ధర కేవలం రూ.2,441 మాత్రమే ఉంది.
అంటే రైతులు ఆశించిన ధర కంటే క్వింటాల్‌కు దాదాపు రూ.800 తక్కువగా ఉందని రైతు సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. మరోవైపు పత్తి రైతుల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉందని చెబుతున్నారు. విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరుగుతున్నా, మార్కెట్‌లో మాత్రం ఆశించిన ధరలు లభించడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే జొన్న, కొర్ర, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలకు గత కొన్నేళ్లలో ఎంఎస్పీలు పెరిగినా, సాగు ఖర్చులు అంతకంటే ఎక్కువగా పెరిగాయని రైతులు చెబుతున్నారు.
వరి–పత్తి ఆధిపత్యంతో క్షీణిస్తున్న నేలసారం..
వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వరుసగా వరి, పత్తి సాగు చేయడంతో భూసారం తగ్గిపోతోంది. భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. రసాయన ఎరువుల వినియోగం పెరిగి నేల నాణ్యత దెబ్బతింటోంది. ప్రత్యేకంగా ఆయకట్టు ప్రాంతాల్లో వరి ఏకపంట సాగు పెరగడం వల్ల ఇతర పంటలకు అవకాశాలు తగ్గిపోయాయి. వారాబందీ నీటి విధానం కూడా వరి సాగుకే అనుకూలంగా ఉండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
ప్రైవేట్ అప్పుల భారం.. పెరుగుతున్న ఆత్మహత్యలు..
బ్యాంకర్ల నుంచి క్రాప్ లోన్ల లభ్యత తగ్గిపోవడంతో రైతులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడుతున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. పంటలకు సరైన ధర రాకపోవడం, వరుస నష్టాలు రైతు కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యామ్నాయ పంటలే భవిష్యత్తు
వ్యవసాయ నిపుణులు మాత్రం తెలంగాణ భవిష్యత్తుకు పంటల మార్పిడి తప్పనిసరి అంటున్నారు. యాసంగిలో వరికి బదులుగా మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ, జనుము, చిరుధాన్యాలు సాగు చేస్తే నేలలో నత్రజని పెరిగి భూసారం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. అలాగే బొబ్బర్లు, ఆముదం, బంతిపూలు వంటి పంటలు రైతులకు అదనపు ఆదాయం ఇస్తాయని చెబుతున్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు వెళ్లడం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో వరిసాగు ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. నీటి కొరత, భూసారం క్షీణత, పెరుగుతున్న పెట్టుబడులు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన బ్యాంకులు, ప్రత్యేక రుణ విధానాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెసింగ్ యూనిట్లు లేక రైతులకు నష్టం
పసుపు, మిరప, వేరుశనగ, చిరుధాన్యాలకు గ్రామీణ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం తో మధ్యదళారులే లాభపడుతున్నారని నిపుణులు అంటున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతుల ఆదాయం 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పంటల వైవిధ్యీకరణకు నాణ్యమైన విత్తనాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలకు గ్రామీణ స్థాయిలో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, మెట్ట ప్రాంతాల్లో సంప్రదాయ విత్తన వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
వరి, పత్తి పంటలకే పరిమతం చేయడం ప్రమాదం
వ్యవసాయాన్ని కేవలం వరి, పత్తి పంటలకే పరిమితం చేయడం ప్రమాదకరం. రాష్ట్రం వెంటనే పంటల వైవిధ్యీకరణ విధానం తీసుకురావాలి. రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు కూడా హామీ ధర, కొనుగోలు భరోసా కల్పించాలి. వరి సాగు పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్
వరి విస్తరణపై ఆందోళనకరం..
రాస్ట్రంలో గత పదేళ్లుగా ప్రభుత్వ విధానాల కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వరి, పత్తి పంటలే అధిక భూమిని ఆక్రమించడంతో ఇతర పంటలు కనుమరుగవుతున్నాయి. ఇది పర్యావరణానికి హానికరం. ధాన్యం కొనుగోలు, బోనస్‌లు రైతులను వరి వైపు మళ్లిస్తున్నాయి. మరోవైపు రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం సమస్యలను పెంచుతోంది. రైతులు ఇతర పంటల వైపు మారాలంటే గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ కొనుగోలు, పంటల బీమా, అడవి జంతువుల సమస్యల పరిష్కారం వంటి భరోసా కల్పించాలి. కేవలం సందేశాలతో మార్పు రాదు. – కన్నెగంటి రవి, కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక
