ఓఎస్ఎం వివాదం ..సీబీఎస్ఈ చైర్మన్ పై వేటు

ఓఎస్ఎం వివాదం ..సీబీఎస్ఈ  చైర్మన్ పై వేటు
  •  ఆయనతో పాటు సెక్రటరీ  ట్రాన్స్​ఫర్​ 
  •    ఓఎస్ఎం వివాదం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం 
  • ఎంక్వైరీకి వన్‌‌‌‌‌‌‌‌-మెంబర్ కమిటీ ఏర్పాటు
  • కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లోఖండే ప్రశాంత్ సీతారాంకు బాధ్యతలు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎమ్) విధానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.  దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)  చైర్మన్ పై బదిలీ వేటు వేసింది.  చైర్మన్ పదవి నుంచి రాహుల్​సింగ్​ను తప్పిస్తూ.. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించింది. బోర్డు సెక్రటరీ హిమాంశు గుప్తాకూ స్థానచలనం కల్పించింది.  పరిపాలనాపరమైన కారణాలను చూపుతూ గుప్తాను ఆయన మాతృ క్యాడర్ అయిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అత్యంత నాటకీయంగా వెనక్కి  పంపింది.  

సీబీఎస్​ఈ కొత్త చైర్మన్‌‌‌‌గా ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న లోఖండే ప్రశాంత్ సీతారాంను కేంద్రం నియమించింది. వరుణ్ భరద్వాజ్‌‌‌‌ను కొత్త సెక్రటరీగా నియమిస్తూ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఓఎస్ఎమ్ సేవల సేకరణ, టెండర్ల ప్రక్రియపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అధికారికంగా వన్‌‌‌‌-మెంబర్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌‌‌‌ పర్సన్ అయిన ఎస్. రాధా చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ నెల రోజుల్లోగా తన సమగ్ర నివేదికను పర్సనల్ అండ్​ ట్రైనింగ్ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది.

పార్లమెంట్ ప్యానెల్ సమన్లు..

సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో వ్యత్యాసాలు, ఫలితాల అనంతర ధ్రువీకరణ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీ సీబీఎస్ఈ మాజీ చైర్‌‌‌‌ పర్సన్ రాహుల్ సింగ్‌‌‌‌, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తో  పాటు సెర్ట్-ఇన్ ప్రతినిధులు, విద్యార్థుల ప్రతినిధులకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఓఎస్ఎమ్​ విధానంపై విద్యార్థులు లేవనెత్తిన ఆందోళనలను పరిశీలించేందుకు విద్యాశాఖ స్థాయీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంజయ్ కుమార్‌‌‌‌తో పాటురాహుల్ సింగ్‌‌‌‌కమిటీ ముందు హాజరై, ఓఎస్ఎమ్ వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై సభ్యులకు వివరించాలని ఆదేశించింది.  ఈ సమావేశంలో సీబీఎస్ఈ విద్యార్థుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని ఈ స్టాండింగ్ కమిటీ, 9 , 10 తరగతులకు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కూడా చర్చించారు.

పార్లమెంటరీ కమిటీ ముందు విద్యార్థి హాజరు..

సీబీఎస్ఈ ఓఎస్ఎమ్ టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన 18 ఏండ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్.. మంగళవారం కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరై తన నివేదికను సమర్పించాడు. కోడింగ్, విస్తృత పరిశోధనల ద్వారా అతడు ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చాడు. హైదరాబాద్‌‌‌‌కు చెందిన 'కోఎంప్ట్ ఎడ్యుటెక్'  సంస్థకు ఈ కాంట్రాక్ట్ దక్కేలా, దానికి ముందే టెండర్‌‌‌‌కు సంబంధించిన కీలక అర్హతలు, మూల్యాంకన నిబంధనలను మార్చేశారని అతడు ఆరోపించాడు.

కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోరా?: ప్రతిపక్షాలు

ఓఎస్‌‌‌‌ఎమ్ విధానంలో జరిగిన అవినీతిలో కేవలం సీబీఎస్‌‌‌‌ఈ చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేస్తూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారుల బదిలీ కేవలం ఒక కంటితుడుపు చర్యేనని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరిపించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోరా? అని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విద్యా మంత్రి రాజీనామా చేయాల్సిందేనని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.