చర్చలు లేవనడం రాజ్యాంగ ఉల్లంఘనే...

చర్చలు లేవనడం రాజ్యాంగ ఉల్లంఘనే...
  • మావోయిస్టులపై బండి సంజయ్​వ్యాఖ్యలు అప్రజాస్వామికం
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి కామెంట్స్

భీమదేవరపల్లి,వెలుగు : మావోయిస్టులతో చర్చలు లేవని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​అనడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, అప్రజాస్వామికమని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ లో  పార్టీ మహాసభలు జరిగాయి. ఇందులో పాల్గొని ముందుగా కారల్​మార్క్స్​చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార అహంభావంతో బండి సంజయ్​ మాట్లాడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమని పార్టీ కూడా ఎన్నో ఏండ్లుగా కోరుతూ వస్తుందన్నారు. 

చర్చలకు పిలిస్తేనే వారి డిమాండ్లు, సమస్యలు ఏంటో తెలుస్తాయని, తద్వారా పరిష్కారాలు కూడా దొరుకుతాయన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా మార్క్సిజాన్ని అంతం చేస్తామనడం అప్రజాస్వామికమన్నారు. మావోయిస్టులు సామాజిక న్యాయం కోసం దేశ ఆర్థిక ఫలాలు ప్రతి ఒక్కరికి సమానంగా అందాలనే సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు.  కేంద్రం కులగణన చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస్​రావు, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ర్ట కమిటీ సభ్యులు ఆదరి శ్రీనివాస్​,రైతు సంఘం రాష్ర్ట నేత రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.