దేశంలో బీజీపీకి అనుకూల వాతావరణం : కిషన్ రెడ్డి

దేశంలో బీజీపీకి అనుకూల వాతావరణం : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కులమతాలకు అతీతంగా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఆఫీసును బీజేపీ కన్వీనర్ రమేశ్​రామ్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తో కలిసి సోమవారం సాయంత్రం కిషన్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్​లెవల్​లో పార్టీని మరింత బలపరచాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా బీజేపీకి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అత్యధిక స్థానాలను గెలిచి మోదీకి గిఫ్టుగా ఇవ్వబోతున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఖేల్ ఖతమైందని, లోక్​సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. ఐక్యత లేని ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలంతా మోదీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పూసరాజు, శ్యాంసుందర్ గౌడ్, సుప్రియ, రవి చారి, రచన శ్రీ, సూర్యనారాయణశర్మ, శేషసాయి, డీఎస్ రెడ్డి, భరత్ గౌడ్, మద్దూరు శివాజీ, శక్తి సింగ్, రాజ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.