సెప్టెంబర్ 7న తెలంగాణకు.. ఏవియేషన్ టెక్నికల్ టీమ్

సెప్టెంబర్ 7న తెలంగాణకు.. ఏవియేషన్ టెక్నికల్ టీమ్
  • కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కోసం స్థలాల పరిశీలన
  • సాంకేతిక నివేదిక అనంతరం తదుపరి చర్యలు
  • విమానయాన శాఖ మంత్రి 
  • రామ్మోహన్ నాయుడితో తుమ్మల భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి కొత్త ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. 

రాజీవ్ గాంధీ భవన్ లోని కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మామునూరు(వరంగల్), ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ ల నిర్మాణంపై చర్చించారు. ప్రధానంగా కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల కోరారు. 

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందాన్ని పంపేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంగీకరించినట్టు చెప్పారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, విమానయాన శాఖకు నివేదిక అందిస్తుందన్నారు. 

ఈ రిపోర్ట్ అనంతరం కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. బుధవారం మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ల ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు.