- మూడు నెలల రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్‌లో రవాణా, నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద, లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన ధాన్యాన్ని ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు ముందుగానే లిఫ్ట్ చేయాలని సూచించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థను మరింత సజావుగా నిర్వహించడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు. కేంద్రం తాజా ఉత్తర్వుల ప్రకారం, రాబోయే కొనుగోలు సీజన్ కారణంగా గోదాముల్లో నిల్వ ఒత్తిడి, రవాణా లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
"ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు రాష్ట్రాలకు కేటాయించిన ఆహార ధాన్యాల స్టాక్‌ను తక్షణమే లిఫ్ట్ చేసి, లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి." ఈ ప్రక్రియలో, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తన గోదాముల్లో తగినంత ధాన్య నిల్వలను నిర్వహించాలని, రాష్ట్రాలతో సమన్వయం చేసి ముందస్తు లిఫ్టింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ చర్యలు రేషన్ దుకాణాల్లో పంపిణీకి అంతరాయం రాకుండా చేస్తాయని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
అయితే, ప్రతి నెలకు సంబంధించిన లావాదేవీలు, ధృవీకరణ ప్రక్రియలు సంబంధిత నెలలోనే స్వతంత్రంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం అధికారుల ఆమోదం పొందినట్లు తెలిపారు. తాజాగా, ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
