OSM తప్పులపై కేంద్రం ఆగ్రహం.. CBSE బోర్డ్ ఛైర్మన్, సెక్రటరీపై బదిలీ వేటు

OSM తప్పులపై కేంద్రం ఆగ్రహం.. CBSE బోర్డ్ ఛైర్మన్, సెక్రటరీపై బదిలీ వేటు

ఢిల్లీ: CBSE పరీక్షల వాల్యుయేషన్కు సంబంధించి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంలో జరిగిన తప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. CBSE బోర్డ్ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాపై కేంద్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

అంతేకాదు.. ఈ ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. CBSE ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంపై ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. మే 13న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పారదర్శకత కోసం సీబీఎస్‌ఈ ఒక కొత్త నిబంధన తెచ్చింది.

ఈ రూల్ ప్రకారం.. విద్యార్థులు వాళ్ళ మార్కులపై రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకునే ముందు.. స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించారు. 

అయితే, ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి.. పోర్టల్ క్రాష్ అవ్వడం, డబ్బులు కట్ అయినా దరఖాస్తు కాకపోవడం, పేపర్లు రావడం ఆలస్యం కావడం, స్కాన్ చేసిన కాపీలు సరిగ్గా కనిపించకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. వాటన్నిటి కంటే మించి, వాళ్లకు  వచ్చిన జవాబు పత్రాలు అసలు వాళ్ళవి కావని కొందరు విద్యార్థుల నుంచి ఆరోపణలు రావడం CBSEపై విమర్శలకు కారణమైంది.

వాల్యుయేషన్కు సంబంధించి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో తప్పులు జరిగాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరోక్షంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘‘ఈ తేడాలకు నేనే బాధ్యత వహిస్తాను. ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థి సందేహానికి సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టం’’ అని మంత్రి ప్రకటించారు.

స్టూడెంట్లు, తల్లిదండ్రులు తమ ఆన్సర్ పేపర్లు చూడటానికి పోర్టల్‌‌ ఓపెన్ చేసినప్పుడు అది పదే పదే క్రాష్ అవడం, పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవడం, స్కాన్ చేసిన పేజీలు బ్లర్​గా కనిపించిన విషయాలను మంత్రి ఒప్పుకున్నారు.