E20 పెట్రోల్ తో ఇంజన్ సమస్యలకు ఆధారాల్లేవ్..కేంద్ర మంత్రి సురేశ్ గోపి

E20 పెట్రోల్ తో ఇంజన్ సమస్యలకు ఆధారాల్లేవ్..కేంద్ర మంత్రి సురేశ్ గోపి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌‌‌‌ను విధిగా విక్రయించాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించిందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి వెల్లడించారు. ఈ20 పెట్రోల్‌‌‌‌ వాడకం అంశంపై రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌‌‌‌ను విక్రయించాలని ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. 

‘‘ఏప్రిల్ 2025 నుంచి తయారయ్యే అన్ని పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి అనుకూలంగా తయారవుతున్నాయి. పాత వాహనాలకు సంబంధించి వాహన తయారీదారుల సూచనలు పాటించాలి” అని వెల్లడించారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) కార్యక్రమాన్ని శాస్త్రీయంగా నిరూపితమైన, సంప్రదింపుల ప్రక్రియతోనే ముందుకు తీసుకెళ్లామని కేంద్ర మంత్రి చెప్పారు. 

భారత్‌‌‌‌లో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం 2001లోనే పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌తో ప్రారంభమైందన్నారు. ‘‘20 కోట్లకు పైగా టూవీలర్లు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇంధన మిశ్రమాలతో నడిచాయి. ఈ20 ఇంధనం వల్ల విస్తృత ఇంజిన్ వైఫల్యాలు లేదా తీవ్రమైన అరుగుదల జరిగినట్లు నిరూపిత ఆధారాలు లేవు” అని తెలిపారు. ‘‘కొన్ని ఈ10- డిజైన్డ్ వెహికల్స్‌‌‌‌(2010– 2023 మధ్య తయారైన వాహనాలు)లో మైలేజీ 3 నుంచి 5% తగ్గుతుంది. ఈ-20 పెట్రోల్‌‌‌‌తో మెరుగైన యాక్సిలరేషన్, రైడ్ క్వాలిటీ ఉంటాయి. 30% తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి” అని పేర్కొన్నారు.