- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభం
చేబ్రోలు (వడ్లమూడి): సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించుకోవడంతో పాటు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే భవిష్యత్ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (ఎన్ఐఏఎస్) డైరెక్టర్ డాక్టర్ శైలేష్ నాయక్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ బ్లూ ఎకానమీని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శైలేష్ నాయక్ మాట్లాడుతూ.. బ్లూ ఎకానమీని కేవలం వాణిజ్యానికే కాక వాతావరణ మార్పులు, జీవనోపాధితో అనుసంధానించాలని తెలిపారు.
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో వేగంగా పురోగతి సాధించగలదని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస కుమార్ తుమ్మల మాట్లాడుతూ మత్స్యరంగం, షిప్పింగ్, పవన-తరంగ శక్తి, పర్యాటకం ద్వారా బ్లూ ఎకానమీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సముద్ర ఆధారిత వివిధ రంగాలను సమన్వయం చేస్తూ ఈ కేంద్రం ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి వేదికగా ఎదగాలని ఇన్కాయిస్ డైరెక్టర్ డాక్టర్ టీఎం బాలకృష్ణన్ నాయర్ ఆకాంక్షించారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ బ్లూ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
