- కొత్త పథకం ‘వీబీ-జీ రామ్జీ’ గైడ్లైన్స్ ఖరారు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో కొత్తగా ‘వికసిత భారత్ -రోజ్‌గార్, ఆజీవిక గ్యారెంటీ మిషన్ (గ్రామీణ)’ (వీబీ–జీ రామ్ జీ) పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ ముసాయిదా నిబంధనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ పథకం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది.
రాష్ట్రాలు, అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్రం 60 శాతం నిధులు సమకూరుస్తుంది. మిగిలిన 40 శాతాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కాశ్మీర్ వంటి హిమాలయ రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేస్తుంది. వీటికి రాష్ట్ర వాటా కేవలం10 శాతమే. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే భరిస్తుంది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, మేధావులు తమ అభిప్రాయాలను, సలహాలను పంపవచ్చని కేంద్రం కోరింది. గెజిట్ వెలువడిన 30 రోజుల్లోగా కేంద్రsuggestion-vbgramg@gov.in అనే ఈమెయిల్ ఐడీకి గానీ తమ అభ్యంతరాలను పంపవచ్చు.
