తెలంగాణ పంచాయతీలకు రూ.619 కోట్లు...పది రోజుల్లోనే ఇవ్వాలి : కిషన్ రెడ్డి

తెలంగాణ పంచాయతీలకు రూ.619 కోట్లు...పది రోజుల్లోనే ఇవ్వాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ.619.85 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులుగా వీటిని పేర్కొన్నారు. ఈ నిధుల విడుదల పట్ల ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌‌‌‌కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.619.85 కోట్ల నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్ కాగా, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ అని కిషన్ రెడ్డి వివరించారు. 

టైడ్ గ్రాంట్ నిధులను గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి అత్యవసర పనుల కోసం వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. అన్ టైడ్ గ్రాంట్ నిధులను మాత్రం ఆయా గ్రామాల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకుని వాడుకోవచ్చని సూచించారు. కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాల్లోపు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి బదిలీ చేయాలని స్పష్టం చేశారు. 

ఆలస్యం చేస్తే  గ్రామ పంచాయతీలకు వడ్డీతో కలిపి నిధులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రెండేళ్లపాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనతో నెట్టుకొచ్చిన కారణంగానే గతంలో నిధుల విడుదల్లో  జాప్యం జరిగిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 16వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ పంచాయతీలకు రూ.9,968 కోట్లు అందనున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యూసీలు సమర్పిస్తే నిధుల విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.