- కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజల హక్కులకు, కార్పొరేట్ అవసరాల మధ్య తీవ్రమైన ఘర్షణ కొనసాగుతోందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు అమలు చేస్తూ, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం నాంపల్లి టీజేఎస్ ఆఫీస్లో కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా, దానిని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, దళితులు, అణగారిన వర్గాల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం.. కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజలు సంఘటితంగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తుండటం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని తెలిపారు.
