- ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- ఏవీయేషన్ ఫ్యూయెల్ ధరల నియంత్రణకు ప్రత్యేక నిధి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్) పరిధిలో వాహన కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాలం చెల్లిన, పాత వాహనాల స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేసుకునేలా వాహనదారులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్ కు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఈ స్కీమ్ లో భాగంగా ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిధిలోని పాత ట్రక్కులు, బస్సులతో పాటు బీఎస్ 4 వాహనాల వాడకాన్ని తగ్గిస్తారు. వాటి స్థానంలో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన కొత్త వాహనాలను, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేసి బీఎస్ 6 వాహనం కొనుగోలుచేసే వారికి ఐదేండ్ల పాటు వాహన రుణాలకు సంబంధించిన వడ్డీని 5% తగ్గించనుంది. అదేవిధంగా, వాహన కేటగిరీని బట్టీ ఆయా యజమానులకు నెలవారీగా ఫ్యూయెల్ ఓచర్లను (రూ.4,800 విలువైన) అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే వారికి భారీ మొత్తంలో సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపాయి.
ఏటీఎఫ్ స్టెబిలైజేషన్ ఫండ్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని నుంచి విమానయాన సంస్థలను రక్షించడానికి, టికెట్ ధరలు అదుపు తప్పకుండా నియంత్రించడానికి విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల స్థిరీకరణ కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ.10,000 కోట్లను ఆమోదించింది. ఈ పథకం కింద ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ సంస్థలకు రూ.10,000 కోట్ల వరకు వడ్డీ లేని అడ్వాన్సులను ప్రభుత్వం అందిస్తుంది.
