- గతంలో సింగరేణేతర ప్రాంతాలకు తరలించినట్లు గుర్తింపు
కోల్‌బెల్ట్, వెలుగు:సింగరేణి విస్తరించిన జిల్లాల్లో కేటాయించే డీఎంఎఫ్టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులతో ప్రభావితమయ్యే ప్రాంతాలకే ఈ నిధులను వెచ్చించేలా ప్రత్యేకంగా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది.
ఇటీవల కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగూడెం ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన ప్రధానితో చర్చించి ప్రత్యేక నిబంధన తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో డీఎంఎఫ్టీ నిధులు సింగరేణేతర ప్రాంతాలకు తరలిపోకుండా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం..
దేశంలో మైనింగ్, గనులతో ప్రభావితమయ్యే ప్రజల అవసరాలు, పరిసరాలను మెరుగుపర్చేందుకు
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) నిధులను వినియోగించేలా మైన్స్, మినరల్స్ అమెండ్మెంట్ యాక్ట్–2015 ను అమలు చేస్తున్నారు. ప్రతి మైనింగ్ ప్రభావిత జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేస్తోంది. సింగరేణి ప్రభుత్వానికి రాయల్టీ, సీనరేజ్ కింద ఫీజు చెల్లిస్తోంది. ఇలా సేకరించిన నిధిలో 98 శాతం డీఎంఎఫ్టీ ఖాతాకు చేరుతుంది. మిగిలిన నిధులు మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో పాలనాపరమైన ఖర్చులకు ప్రభుత్వం ఉపయోగించవచ్చు.
నిధుల నుంచి 60 నుంచి 70 శాతం వరకు ఆరోగ్యం, విద్య, శిక్షణ, ఉద్యోగ నైపుణ్యం, మహిళలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, నీరు, రహదారులు, డ్రైనేజీలు, సేద్యం, ఇరిగేషన్, శక్తి వాటర్‌షెడ్స్ తదితర సంక్షేమ పనులకు వినియోగించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్ దీనిని పర్యవేక్షిస్తుంది.
పదేండ్లలో రూ.2,600 కోట్లు తరలించిన్రు..
సింగరేణి విస్తరించిన రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో కేటాయించిన డీఎంఎఫ్టీ నిధులు వందల కోట్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. సింగరేణి డీఎంఎఫ్టీ నిధులు ఇక్కడే ఖర్చు చేయాలనే నిబంధన ఉన్నా, లొసుగులను ఆసరా చేసుకొని సింగరేణేతర నియోజకవర్గాలకు తీసుకెళ్లారు. గత బీఆర్ఎస్ పాలనలో పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, నిజామాబాద్వంటి నియోజకవర్గాలకు వందల కోట్లను తరలించారు.
సింగరేణి నుంచి తరలించిన డీఎంఎఫ్టీ, ఇతర నిధులను సిద్దిపేటలో స్టేడియం, సిరిసిల్ల, గజ్వేల్‌లో బిల్డింగ్లు,సెంట్రల్‌లైటింగ్,హైదారాబాద్ జూపార్క్‌లో అభివృద్ది పనులకు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పలుకుబడి ఉన్న నేతలు తమకు నచ్చిన చోట, నచ్చిన విధంగా ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు ఖర్చు చేశారు.
బెల్లంపల్లి పట్టణ శివారులోని కన్నాల పరిధిలో ప్రైవేట్ వెంచర్లకు లబ్ధి చేకూర్చేలా రూ.49 లక్షలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు కోసం ఖర్చు చేశారు. ఇలా పదేండ్లలో రూ.2,600 కోట్ల వరకు ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాలకు తరలివెళ్లాయి. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే ప్రభావిత ప్రాంతాలైన12 నియోజకవర్గాలకు మాత్రం అతి తక్కువగా వెచ్చించారు.
బొగ్గు ఉత్పత్తి వల్ల ప్రభావితమవుతున్న పట్టణాలు, గ్రామాలకు వాటిని ఉపయోగించాలి. మైనింగ్ కార్యకలాపాలతో బొగ్గు ధూళి, ధ్వని, పేలుళ్లతో ప్రభావితమైన ప్రాంతాలను పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. ఎలాంటి సంబంధం లేని ఇతర నియోజకవర్గాలకు ఈ ఫండ్స్ పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. తాజాగా కొన్ని నియోజకవర్గాలకు ఈ నిధులు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.
ప్రత్యేక నిబంధనలపై నజర్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సింగరేణి సంస్థ నడుస్తోంది. సంస్థలో 51శాతం వాటా రాష్ట్రం,49 శాతం వాటా కేంద్రానికి వర్తిస్తుంది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో త్వరలో రూ.1700 కోట్ల డీఎంఎఫ్టీ నిధులు కేటాయించేందుకు రెడీ చేస్తున్నారు.ఈ నిధులను పూర్తిగా ప్రభావిత ప్రాంతాలకే వెచ్చించేలా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆఫీసర్లతో చర్చించి సింగరేణి విస్తరించిన జిల్లాల అభివృద్ధికే డీఎంఎఫ్టీ నిధులు కేటాయించాలని సూచించారు. ఇందులో భాగంగానే సింగరేణేతర ప్రాంతాలకు నిధులు తరలిన విషయాన్ని గుర్తించారు. నిధుల వినియోగంలో లొసుగుల్ని తొలగించేలా ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మంత్రి నిర్ణయించారు. మరోవైపు సింగరేణి బోర్డు డైరెక్టర్ల ప్రాధాన్యం పెంచేలా కేంద్రం దృష్టి సారించింది.
