దేశ చరిత్రలో మైలురాయి.. రాముడి గుడి

దేశ చరిత్రలో మైలురాయి.. రాముడి గుడి
  • రామ్ లల్లా ప్రతిష్ఠాపనతో శతాబ్దాల కల సాకారం: రాష్ట్రపతి ముర్ము  
  • కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత భేష్ అని ప్రశంస
  • పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 
  • 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డరు 


న్యూఢిల్లీ:  అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం, ఆర్థిక సంస్కరణలు, పేదరిక నిర్మూలన వంటి అనేక విజయాలను తన ప్రభుత్వం సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గత పదేండ్లలో టెర్రరిజం, తిరుగుబాట్లను రూపుమాపడంతోపాటు సరిహద్దుల్లో ఆక్రమణలకు, చొరబాట్లకు తెగబడుతున్న పొరుగు దేశాలకు మన సైనిక బలగాలు దీటుగా జవాబు చెప్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే టెర్రరిజానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రధాన గొంతుకగా భారత్ నిలిచిందన్నారు. చంద్రయాన్–3 విజయం, జీ20 సమిట్ నిర్వహణ, ఏసియన్ గేమ్స్​లో సత్తా చాటడంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం పార్లమెంట్ కొత్త బిల్డింగ్​లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి 75 నిమిషాల పాటు ప్రసంగించారు.  

జనవరి 22 ఓ మైలురాయి.. 

దేశ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అనేక ప్రాజెక్టులు గత పదేండ్లలో సాకారం అయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ‘‘అయోధ్యలో రాముడికి గుడి కట్టాలన్నది శతాబ్దాల నాటి కోరిక. నేడు అది వాస్తవరూపం దాల్చింది. సాంస్కృతిక చరిత్రలో శతాబ్దాల భవిష్యత్తును నిర్ణయించే కొన్ని మైలు రాళ్లు ఉంటాయి. జనవరి 22న అలాంటి ఓ మైలురాయిని దేశం చూసింది” అని ఆమె అన్నారు.

దేశ భద్రత పటిష్టం 

దేశ సరిహద్దుల వెంబడి మోడ్రన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మన బలగాలు.. టెర్రరిస్టులు, శత్రుదేశాల సైనికులను దీటుగా తిప్పికొడుతున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశమంతటా అంతర్గత భద్రత పటిష్టంగా మారిందన్నారు. దేశంలో నక్సలిజం తగ్గిందని అన్నారు.  జమ్మూకాశ్మీర్​ సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ తొలిసారిగా అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించామన్నారు. 

ఆర్థిక వృద్ధి వేగవంతం

రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ రూ. లక్ష కోట్ల మార్కును దాటడం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి అభినందించారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కీలకంగా నిలుస్తున్నాయన్నారు. భారత ఎకానమీ ఇప్పుడు సరైన దిశలో ముందుకు వెళ్తోందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే భవనం యువ శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపైనే నిలబడుతుందన్నారు. కాగా, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో గత పదేండ్ల పాలనలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పాస్ చేయడం, ట్రిపుల్ తలాఖ్​కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని తేవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఎగ్జామ్స్​లో అవకతవకలు, మాల్ ప్రాక్టీస్​లను నివారించేందుకు కఠినమైన చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  

రైతులకు రూ. 18 లక్షల కోట్లు..

పదేండ్లలో గోధుమలు, వడ్లను కనీస మద్దతు ధరతో ప్రభుత్వం సేకరించిందని, ఇందుకోసం రైతులకు రూ.18 లక్షల కోట్లను చెల్లించిందని రాష్ట్రపతి వెల్లడించారు. 2014 నుంచి పదేండ్లలో ఎంఎస్పీని 2.5 రెట్లు పెంచిందన్నారు. నూనెగింజలు, పప్పులను ఎంఎస్పీతో సేకరించడం ద్వారా రైతులకు రూ.1.25 కోట్ల లబ్ధి జరిగిందన్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లోకి రూ.2.8 లక్షల కోట్లు జమ చేశామన్నారు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ. 1.5 లక్షల కోట్ల పంట నష్టపరిహారం అందజేసినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. 

సెంగోల్​తో పార్లమెంట్​లోకి..  

పార్లమెంట్ హౌస్ వద్దకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్రపుబగ్గీలో చేరుకున్నారు. హత్రోయి ట్యూన్ తో కళాకారులు సంగీతం వినిపిస్తుండగా.. సెంగోల్​ను సభలోకి తీసుకొచ్చారు. సెంగోల్ వెనకే రాష్ట్రపతి నడుచుకుంటూ సభలోకి ప్రవేశించారు. రాష్ట్రపతిని అనుసరిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలికారు. అనంతరం సెంగోల్ ను సభ మధ్యలో రాష్ట్రపతి డెస్క్ ముందు వేదికపై ప్రతిష్ఠించారు. కాగా, పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లో రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నందున ఈ లోక్ సభకు ఇదే చివరి సెషన్ కానుంది.