హైదరాబాద్ / సికింద్రాబాద్/పర్వతగిరి(సంగెం), వెలుగు:హైదరాబాద్‌లో చైన్ స్నాచర్‌లు రెచ్చిపోయారు. -వృద్ధులను టార్గెట్‌గా చేసుకొని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 24 తులాల బంగారాన్ని చోరీ చేశారు. పూలు కావాలి.. పాలు కావాలి.. ఇంటి అడ్రస్ కావాలి అంటూ వివిధ సాకులతో వృద్ధులకు దగ్గరగా వెళ్లి చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డారు. శనివారం ఉదయం వేళ సిటీ పరిధిలో రెండే రెండు గంటల వ్యవధిలో 7 చోట్ల చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇక వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలోనూ ఇదే తరహాలో ఒక చోరీ జరిగింది. వరుస చైన్ స్నాచింగ్స్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ల లొకేషన్స్, గతంలో ఇదే తరహా దొంగతనాలు చేసిన వారి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్‌కు దుండగులు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది రామ్‌కోఠికి చెందిన దత్తాత్రేయ గణేశ్ పూరి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. ఆ బైక్ అబిడ్స్ పీఎస్ పరిధిలో చోరీకి గురైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ,యూపీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠానే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే దొంగలను అరెస్టు చేస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
శనివారం తెల్లవారుజామున ఓ పల్సర్ బైక్‌పై ఇద్దరు దొంగలు హల్‌చల్ చేశారు. అది కూడా వాళ్ల బైక్ కాదు.. మరోచోట దొంగిలించి తీసుకొచ్చింది. ఆ బైక్‌పైనే ఉదయం 6.20 గంటల నుంచి వరుస చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డారు. తొలి ఘటన ఉప్పల్‌లోని మాస్టర్ చెఫ్ సమీపంలో చోటుచేసుకుంది. అక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్న వృద్ధురాలు పూలమ్మ(73) గొలుసును లాక్కెళ్లారు.
టైం 6.40 : కళ్యాణపురిలో బైక్ పైనుంచే..
ఉప్పల్‌లోని మాస్టర్ చెఫ్ కు సమీపంలో ఉన్న కళ్యాణపురిలో 6.40 గంటలకు మరో స్నాచింగ్ చేశారు. ఇక్కడ కూడా మార్నింగ్ వాక్ కు వెళ్లిన వృద్ధురాలు రాజేశ్వరి (72) మెడలో నుంచి పుస్తెల తాడును లాక్కెళ్లారు.
టైం 7.10 : పూలు కావాలని.. పుస్తె లాక్కెళ్లిండ్రు
ఉప్పల్ కళ్యాణపురి కాలనీ మీదుగా దొంగలు నాచారం వెళ్లారు. ఉదయం 7.10 గంటల సమయంలో నాగేంద్రనగర్‌లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలు విమల(70)ను పూలు కావాలని అడిగారు. మీరెవరు ? ఎక్కడుంటారు ? అని ఆమె అడుగుతుండగానే ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్‌ను చూపిస్తూ ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు.
టైం 7.40 : అడ్రస్ వెతుకుతున్నట్టు నటించి
నాచారం నుంచి సరిగ్గా అరగంట తరువాత (7.40 గంటలకు) ఓయూ పీఎస్ పరిధిలోని హబ్సిగూడ రవీంద్రనగర్‌కు వెళ్లారు. ఇంటి ముందు చెట్టుకున్న పూలను కోస్తున్న వృద్ధురాలు జానకి(70) దగ్గరికి వెళ్లారు. సునీల్‌శర్మ ఇల్లు ఎక్కడమ్మా..? అని అడిగారు. ఈ ప్రశ్న అడిగేలోపే జానకమ్మ మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు.
టైం 8.00 : చిలకలగూడలోనూ సీన్ రిపీట్
హబ్సిగూడ రవీంద్రనగర్ నుంచి డైరెక్ట్‌గా చిలకలగూడకు చైన్ స్నాచర్ల బ్యాచ్ వెళ్లింది. 8గంటల సమయంలో సుధగాని మంగ(51) అనే మహిళను టార్గెట్ చేశారు. ఇంటి ముందు నిలబడి ఉన్న మంగకు ఓ చీటీ చూపించారు. అందులో ఉన్న అడ్రస్ చెప్పాలంటూ దృష్టి మరల్చి, ఆమె మెడలోని మూడు తులాలు బంగారు గొలుసును లాక్కెళ్లారు.
టైం 8.20 : మైలార్‌గడ్డలో..
చిలకలగూడ నుంచి సరిగ్గా 8.20 గంటలకు మైలార్‌గడ్డకు చేరుకున్నారు. అక్కడ గుడికి వెళ్తున్న వృద్ధురాలు విజయలక్ష్మి(70)ని వెనుక నుంచి ఫాలో అయ్యారు. ఆమె మెడలోంచి ఏడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళారు.
టైం 8.30 : జనసంచారాన్ని చూసి.. బైక్ వదిలేసి పరార్
పదినిమిషాల వ్యవధిలో (8.30 గంటల సమయంలో) అదే రూట్‌లోని రాంగోపాల్‌పేట్ కృష్ణానగర్ కాలనీకి చైన్ స్నాచర్లు వెళ్లారు. పాలప్యాకెట్ తీసుకొస్తున్న జెబిటిన్(87) అనే వృద్ధురాలి మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. అయితే అప్పటికే ఆ ఏరియాలో జనసంచారం ఎక్కువగా ఉంది. దీంతో భయంతో చైన్ స్నాచర్లు అక్కడే పల్సర్ బైక్ (టీఎస్ 12 ఈఎస్ 7408) వదిలేసి ఎస్కేప్ అయ్యారు. ఈ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో ఎస్కేప్..
పోలీసులు 15 టీమ్స్‌తో స్నాచర్ల కోసం నగరమంతా గాలించారు. స్నాచింగ్స్ తరువాత దొంగలు చిలకలగూడ నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఆటోలో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన ఫుటేజీని సేకరించారు. కాచిగూడ నుంచి ఒడిశాకు వెళ్లే కోణార్క్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచర్లు ఎస్కేప్ అయినట్లు గుర్తించారు. రైల్వే టికెట్ల బుకింగ్స్ ఆధారంగా ఏడుగురి వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా మెహరాజ్, హసన్ పేర్లు ఉన్న ఇద్దరు అనుమానితులను గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే వీళ్ల గ్యాంగ్ హైదరాబాద్ కు వచ్చినట్లు గుర్తించారు.
త్వరలోనే స్నాచర్లను అరెస్ట్ చేస్తం
‘‘ వరుస స్నాచింగ్స్ కేసులను సీరియస్‌గా తీసుకున్నం. జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నం. ఇంకా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. స్నాచింగ్స్ చేసింది ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌గా గుర్తించినం. పాత నేరస్తులే ఈ దోపిడీలు చేసిండ్రు. స్పెషల్ టీమ్స్‌తో గాలిస్తున్నం. వీలైనంత త్వరలో స్నాచర్లను అరెస్ట్ చేస్తం”
- డీఎస్ చౌహాన్, సీపీ, రాచకొండ
