హైదరాబాద్, వెలుగు: ఈ నెల 27న అంబర్ పేట డీడీ కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. శనివారం ఉదయం జరిగిన చైన్ స్నాచింగ్ లో ముగ్గురు యువకులను ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.2లక్షల విలువ చేసే నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, స్నాచింగ్ ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
ఒక్క చైన్ తో రూ. లక్ష
పోట్లకూరి మనోజ్ కుమార్(18) సొంతూరు సిద్దిపేట జిల్లా గణపురం. కాచిగూడ క్రాస్ రోడ్స్ లో ఉంటూ స్విగ్గిలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. మనోజ్ కుమార్ తో పాటు సుల్తాన్ బజార్ కు చెందిన ఠాకూర్ అశ్విన్ సింగ్ (22)జోమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇందులో స్విగ్గిలో పనిచేస్తున్న మనోజ్ కుమార్ కి రూ. 3 వేలు అవసరమయ్యాయి. దీంతో తనకు తెలిసిన అశ్విన్ సింగ్ ను మనోజ్ కుమార్ డబ్బులు అడిగాడు. అశ్విన్ దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో మరికొంత మంది స్నేహితులను అడిగారు. కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు. ఈ క్రమంలో అశ్విన్.. మనోజ్ కుమార్ కి ఓ సలహా ఇచ్చాడు. అదే చైన్ స్నాచింగ్. ఒక్క చైన్ స్నాచింగ్ చేస్తే కనీసం రూ. లక్ష చేతిలో ఉంటాయని చెప్పాడు. స్నాచింగ్ చేయగా వచ్చిన డబ్బుతో తమ అవసరాలు తీర్చుకోవచ్చని అశ్విన్, మనోజ్ ఇద్దరూ ఆలోచించారు. స్నాచింగ్ తర్వాత మళ్ళీ ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చని భావించారు.
బైక్ రైడర్ తో ప్లాన్
అశ్విన్ కి తెలిసిన హర్ష జోషి(19)తో తమ ప్లాన్ చెప్పారు. ఇంటర్ ఫెయిలైన హర్ష బైక్ రైడింగ్ లో మంచి ఎక్స్ పర్ట్. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే హర్ష ఆవారాగా తిరిగేవాడు. అశ్విన్, మనోజ్, హర్ష ముగ్గురు కలిసి చైన్ స్నాచింగ్ కి శుక్రవారం రాత్రి ప్లాన్ చేశారు. స్నాచింగ్ కోసం అశ్విన్ వద్ద ఉన్న పల్సర్ 220సీసీ బైక్ ను హర్షకు ఇచ్చాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ తొలగించాడు. తమ స్కెచ్ లో భాగంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి రెక్కీ వేశారు. హర్ష బైక్ నడుతుండగా వెనుక మనోజ్ కూర్చున్నాడు. వీళ్ళ బైక్ ను.. ఏపీ 09 సీఏ 3643 నంబర్ గల హోండా యాక్టివ్ పై అశ్విన్ ఫాలో అయ్యాడు. ఇలా రెండు బైక్ లపై ముగ్గురు ఫీవర్ హాస్పిటల్, డీడీ కాలనీలో తిరిగారు.
ఇలా కొట్టేశారు
శనివారం ఉదయం 9.40గంటల సమయంలో డీడీ కాలనీలోని సాయిబాబా గుడికి వెళ్లి వస్తున్న అనసూయ(55) మెడలో బంగారాన్ని ఈ ముగ్గురు గుర్తించారు. బైక్ డ్రైవ్ చేస్తున్న హర్ష జోషి అనసూయ వద్దకు వెళ్ళగానే స్లో చేసి.. ఆమె మెడలోని 4 తులాల బంగారు పుస్తెల తాడును లాగేశాడు. పుస్తెల తాడు చేతిలో పడగానే అదే స్పీడ్ లో ఏఎంఎస్ కమాన్, విద్యానగర్ మీదుగా కాచిగూడ జూనియర్ కాలేజ్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో బైక్ వెనుక కూర్చున్న మనోజ్ కుమార్ తమను ఎవరైనా వెంబడిస్తున్నారో.. లేదో గమనించాడు. ఆ తర్వాత కాచిగూడ జూనియర్ కాలేజ్ వద్ద హర్ష తన టీ షర్ట్ మార్చున్నాడు. హెల్మెట్ తీసేశాడు. ఇది అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. హెల్మెట్ తీయడంతో హర్ష ముఖం స్పష్టంగా కనిపించింది.
నంబర్ ప్లేట్ లేకున్నా పట్టుకున్నారు
బాధితురాలు అనసూయ ఇచ్చిన కంప్లయింట్ తో అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చైన్ స్నాచింగ్ పగటి వేళలో జరగడంతో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంబర్ పేట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ బి.రమేష్ తో పాటు మలక్ పేట్,నల్లకుంట డిఐలు నాను నాయక్, సైదులుతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. స్నాచింగ్ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి పరిసర ప్రాంతాల్లోని రోడ్లలో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఇందులో స్నాచర్లు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ ను మరో హోండా యాక్టివా ఫాలో కావడం గుర్తించారు. స్నాచర్లు వాడిన పల్సర్ బైక్ చివరి లొకేషన్ ను కాచిగూడలో గుర్తించారు. బైక్ డ్రైవ్ చేసిన హర్ష గురించి ఆరా తీశారు.
నిందితులను కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోని జైన మందిర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి కొట్టేసిన పుస్తెల తాడు, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత ఈజ్ మనీ కోసం చెడు దారులు పట్టొద్దని..కేసుల్లో చిక్కకుంటే జైలు శిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. సిటీలో సీసీ కెమెరాలు సక్సెస్ అయ్యాయని..ఈ చైన్ స్నాచింగ్ తో పాటు చాలా కేసులను సీసీ ఫుటేజ్ తో సాయంతో ఛేదించామన్నారు. సిటిజన్లు తమ సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
