ఉప్పల్, వెలుగు: ఈజీ మనీ కోసం మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, ఓయూ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అంబర్‌పేటకు చెందిన ఫ్లవర్ డెకరేటర్ పులిపాటి హేమంత్ కుమార్, రామంతాపూర్‌కు చెందిన పల్లె దీపక్ పాత నేరస్తులు. వీరిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరిద్దరితోపాటు రామంతాపూర్‌కు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి మాల్శంకరయ్య (20) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 17న హబ్సిగూడలోని కరూర్ వైశ్యా బ్యాంక్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేశారు. హోండా యూనికార్న్ బైక్‌పై వచ్చి ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.
అనంతరం ఆ గొలుసును మూడు ముక్కలు చేసి, భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోల్డ్‌స్మిత్ రామాచారికి అమ్మారు. వచ్చిన డబ్బుతో ప్రధాన నిందితుడు హేమంత్ ఏకంగా ఒక కొత్త పల్సర్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసుతో పాటు దొంగతనానికి వాడిన యూనికార్న్ బైక్, కొత్తగా కొన్న పల్సర్ బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

