- డీడీ ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ కె.శివన్
- విక్రమ్‌ను లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
- 14 రోజులు దానిపైనే మా దృష్టంతా
- విక్రమ్ ఫలితం వేరే ప్రయోగాలపై పడదు
బెంగళూరు: విక్రమ్ ల్యాండింగ్ ప్రయోగంలో తాము ఓడిపోలేదని, ఇది ఎంత మాత్రమూ ఓటమి కాదని ఇస్రో చైర్మన్ కే శివన్ తేల్చి చెప్పారు. ఇప్పుడు తాము కోల్పోయింది ఓ చిన్న విషయం మాత్రమేనన్నారు. దీని ప్రభావం తర్వాత చేయబోయే ప్రయోగాలపై ఏ మాత్రం పడదన్నారు. శనివారం ఆయన డీడీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే..
పిల్లల మనసు నిర్మలం..
నిజం. మేమేం ఓడిపోలేదు. ఓటమి కాదు. ఈ విషయంలో పిల్లలు కరెక్ట్. ప్రతి విషయంపై వాళ్లకు ఓ ఆసక్తి అనేది ఉంటుంది. వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టే అందరికన్నా బాగా ఏ విషయాన్నైనా వాళ్లు అర్థం చేసుకుంటారు. పిల్లలు ఇలా వచ్చి ప్రయోగాలు చూస్తుంటే మాకూ స్ఫూర్తిగా ఉంటుంది. భవిష్యత్తులో వాళ్లేం చేయాలో ఈ ప్రయోగాలు వాళ్లకు చెబుతాయి. మేం వాళ్లకు లైవ్‌గా చూపిస్తున్నాం. విక్రమ్ ప్రయోగం నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నా.
చంద్రయాన్2.. 100% సక్సెస్
30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విక్రమ్‌ను బాగానే తీసుకెళ్లాం. అయితే, చివరి దశలో 2.1 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేటప్పటికి అది గతి తప్పింది. విక్రమ్ నుంచి సిగ్నల్ కోల్పోయినా మేం ల్యాండింగ్ ప్రక్రియలో 95 శాతం సక్సెస్ అయ్యాం. చంద్రయాన్ 2 మిషన్ దాదాపు వంద శాతం సక్సెస్ఫుల్ అయినట్టే. ల్యాండింగ్‌ను నాలుగు ఫేజ్‌లలో చేయాల్సి ఉంది. రఫ్బ్రేకింగ్ ఫేజ్, కోర్సింగ్ ఫేజ్, ఫైన్ బ్రేకింగ్ ఫేజ్, టెర్మినల్ ఫేజ్. మూడు ఫేజ్‌లు బాగానే జరిగాయి. చివరి ఫేజ్‌లోనే లింక్ పోయింది. మళ్లీ దాన్ని లైన్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. 14 రోజులు దానితో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే, పేలోడ్లతో జాబిల్లిపై ప్రయోగాలు చేస్తాం.
తర్వాతి మిషన్లపై ప్రభావం లేదు
విక్రమ్ ల్యాండింగ్ ఫలితం ప్రభావం ఇతర ప్రయోగాలపై పడదు. మా దృష్టంతా ఇప్పుడు కార్టోశాట్3 మిషన్‌పైనే ఉంది. అక్టోబర్ చివరి నాటికి ఆ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడతాం. ఆ తర్వాత వారానికే ఆర్‌ఏశాట్2బీఆర్ మిషన్ ఉంటుంది. ఆ రెండు ప్రయోగాల తర్వాత గగన్యాన్పైనే పనిచేస్తాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్‌యాన్ మిషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాం. 2020 చివరి నాటికి ఈ ప్రయోగాన్ని చేస్తాం. ఇవే కాకుండా ఇంకా చేతి నిండా చాలా మిషన్లున్నాయి. వాటితో చాలా బిజీగా ఉన్నాం.
ఆర్బిటర్ సైన్స్.. ల్యాండర్ టెక్నాలజీ
చంద్రయాన్ 2లో రెండు విషయాలున్నాయి. ఒకటి సైన్స్, రెండు టెక్నాలజీ. సైన్స్‌కు ఆర్బిటర్ చాలా చాలా కీలకం. ల్యాండర్, రోవర్లు టెక్నాలజీకి నిదర్శనం. ఆర్బిటర్‌లో చాలా ప్రత్యేకమైన పేలోడ్లున్నాయి. అందులో ఒకటైన డ్యుయల్ బ్యాండ్ ఎస్ఏఆర్ ముఖ్యం. ఎల్, ఎస్ బ్యాండ్లుంటాయి. చంద్రయాన్ 1 సహా ఇప్పటిదాకా జరిగిన ఆర్బిటర్ ప్రయోగాల్లో ఒక్క ఎస్‌బ్యాండ్ మాత్రమే ఉండేది. చంద్రయాన్ 2లో ఎల్బ్యాండ్ను జత చేశాం. ఈ ఎల్బ్యాండ్ చంద్రుడి ఉపరితలంపై 10 మీటర్ల లోతు వరకు స్కాన్ చేయగలదు. ధ్రువాల వద్ద ఐస్, వాటర్ ఆనవాళ్లను ఇది కనిపెడుతుంది. అదే దాని స్పెషాలిటీ. ఆర్బిటర్‌లో హై రిజల్యూషన్ కెమెరాలున్నాయి. 0.32 మీటర్ రిజల్యూషన్ ఉంటుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్ కూడా కీలకమే. ప్రపంచ దేశాలు 3 మైక్రాన్ వేవ్‌లెంగ్త్ కలిగిన వాటినే వాడుతున్నాయి. కానీ, చంద్రయాన్ 2 ఆర్బిటర్‌లో 5 మైక్రాన్ వేవ్‌లెంగ్త్ పవర్ ఉన్న దానిని వాడాం. ఈ పేలోడ్‌లన్నీ కలిసి చాలా డేటాను సేకరిస్తాయి.
మోడీ మాటలు మాకు స్ఫూర్తి
మేం ప్రయోగంలో ఫెయిలైనా ప్రధాని నరేంద్ర మోడీ మాకు ధైర్యం చెప్పారు. మాలో స్ఫూర్తి నింపారు. మా అందరికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. సైన్స్ ఫలితాల కోసం చూడదని, కేవలం ప్రయోగాలకు అది వారధి అని ప్రధాని చెప్పారు. ఆ ప్రయోగాలే ఫలితాలిస్తాయన్నారు. ఆయన చెప్పింది నిజం. ప్రధాని మాటలతో సైంటిస్టుల్లో చాలా ధైర్యం వచ్చింది.
ఆర్బిటర్ ఏడున్నరేళ్లు..
ఆర్బిటర్ 100 శాతం బాగా పనిచేస్తోంది. సైన్స్‌కు సంబంధించి దానిలో మేం సక్సెస్ అయ్యాం. ధ్రువాల వద్ద అది పనిచేస్తుంది. నిజానికి ఆర్బిటర్ ఏడాదిపాటు పనిచేసేటట్టే తయారు చేశాం. కానీ, దానిలో ఇప్పుడు చాలా ఎక్కువ ఇంధనం ఉంది. దాంతో అది ఏడున్నరేళ్లు పనిచేస్తుంది. ఈ ఏడున్నరేళ్లలో ఆర్బిటర్ చాలా డేటాను సేకరిస్తుంది. అందులోని హై రిజల్యూషన్ కెమెరాతో మొత్తం చంద్రగోళాన్ని కవర్ చేయొచ్చు. ఫొటోలు తీయొచ్చు. ఆర్బిటర్ సేకరించిన డేటాను ప్రపంచ దేశాలు వాడుకోవచ్చు. ప్రయోగాలు చేయొచ్చు.


