కోల్‌కతా/ఉత్తరపారా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ప్రజలు మార్పు కోసం ఉత్సాహంగా ఓటేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. తూర్పు భారతావనిలోని ప్రాచీన రాజ్యాలైన అంగ, వంగ, కళింగ(బిహార్, బెంగాల్, ఒడిశా) ప్రాంతాల్లో వచ్చే నెలలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒడిశా(కళింగ)లో ఇప్పటికే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బిహార్(అంగ)లో సామ్రాట్ చౌదరి నేతృత్వంలో తమ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిందని తెలిపారు. మే 5 తర్వాత బెంగాల్(వంగ)లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. బెంగాల్‌లోనే పుట్టి, బెంగాలీ మాట్లాడే వ్యక్తి మాత్రమే రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని, బయటి వ్యక్తులు వస్తారన్న మమతా బెనర్జీ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

