బహుజనులు పాలకులైతేనే పేదల బతుకుల్లో మార్పు

బహుజనులు పాలకులైతేనే పేదల బతుకుల్లో మార్పు

ఎల్బీనగర్, వెలుగు:  బహుజనులు 75 ఏళ్లుగా బానిసలుగానే బతుకున్నారని రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం అనాజ్​పూర్​లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  బడుగు బలహీన వర్గాలు 75 ఏళ్లుగా అణిచితవేత,అవమానాలతో జీవిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలక వర్గాలు ధనిక వర్గలకు కొమ్ముకాస్తూ..  పేదలను బాగు విస్మరించి ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని  విమర్శించారు. బహుజన రాజ్యం వస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. రాజ్యాధికారం సాధించుకుంటేనే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లవుతాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూస్వాముల వర్గాలకే కాంట్రాక్టులు వెళ్లాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ దాత అల్వాల్ శేఖర్, బీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, ద్రావిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిలకర శ్రీనివాస్, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్, బహుజన ధూం ధాం వ్యవస్థాపకులు వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్, రాంబాబు, ప్రవీణ్, నవోదయ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.