చే గువేరా పేరు చెప్పగానే చాలా మందిలో ఉత్సాహం వస్తుంది. విప్లవాత్మక అంకితభావం, యువతకు చిహ్నమైన చే గువేరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆయన కుమార్తె.. శ్రీమతి అలీడా గువేరా హైదరాబాద్కు రానున్నారు. ఈనెల 22న ఆమె రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులేనని క్యూబా ప్రతినిధులు తెలిపారు.
అర్జెంటీనాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చే గువేరా వృత్తిపరంగా డాక్టర్. అతను తన 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు. తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు.
