
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు, పథకాలు తీసుకొచ్చిందని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్.. మెఘా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనికుడిని చేశారని ఆరోపించారు. కోరుట్లలో మాజీ మంత్రి రత్నాకర్ రావు పేరుతో ఫిర్యాదుల (టోల్ ఫ్రీ) నంబర్ ఆవిష్కరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దాదాపు వంద మంది బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు..వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. ఒక్క ఎకరానికి నీళ్లియ్యలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు బుద్ది చెప్పారని విమర్శించారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రజాపాలన మొదలు పెట్టింది.. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇనుప కంచెలో ఉన్న ప్రగతి భవన్ ను ప్రజల ముందు పెట్టామన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గొప్ప నాయకుడని.. ఆయను ఎంపీగా గెలిపించాలని కోరారు.