సింగపూర్​ పిల్లలకు లక్కీ చాన్స్

సింగపూర్​ పిల్లలకు లక్కీ చాన్స్
  • పన్ను ఎగ్గొ ట్టేందుకు ఇండ్లు కొనిస్తున్న తల్లిదండ్రులు
  • చిన్నవయసులోనే కోటీశ్వరులు

ఐదేళ్ల నుంచి వరుసగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తున్న సింగపూర్​లో ఇల్లు కొనాలంటే.. కోట్లు కుమ్మరించాల్సిందే. కానీ.. సింగపూర్ ​పిల్లలకు భలే చాన్స్ ​దొరికింది. పట్టుమని 20 ఏళ్లు నిండకుండానే.. ఖరీదైన ఇండ్లను సొంతం చేసుకుంటున్నారు. అబ్బో.. చిన్న వయసులోనే ఇండ్లను కొంటున్నారంటే.. బాగానే సంపాదిస్తున్నారని అనుకుంటున్నారా? అదేంలేదు.. తల్లిదండ్రులే వాళ్ల పేరు మీద ఇండ్లను కొనేస్తున్నారు. సింగపూర్​ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూల్సే దీనికి కారణం. కొన్ని ప్రాంతాల్లో ఒక అపార్ట్​మెంట్ పెంట్​హౌస్​ ​రేటు సుమారుగా రూ. 6 కోట్లకు పైనే పలుకుతోంది. దీన్ని నియంత్రించాలని భావించిన సింగపూర్​ ఇటీవల కొన్ని కొత్త రూల్స్​ పెట్టింది.  రెండో ఇల్లు కొంటే అదనపు స్టాంప్​ డ్యూటీ కింద  12 % పన్ను ​కట్టాల్సిందే. మూడో ఇల్లు కావాలంటే 15% పన్ను.  అంటే.. ఒకరకంగా ఇది సంపన్నులపై విధించే ట్యాక్స్​అన్నమాట. సింగపూర్​లో  సంపన్నవర్గాల ప్రజలు ఎన్ని ఆస్తులను పోగేసుకుంటే అంత గొప్పగా భావిస్తున్నారట. అందుకే నచ్చిన ప్రాపర్టీలన్నీ కొనేస్తున్నారట. కానీ.. ఇప్పుడు ట్యాక్స్​అడ్డంకి కావడంతో వారి చూపు పిల్లలపై పడింది. మొదటిసారి ఇల్లు కొనేవారికి ఏబీఎస్డీ ఉండదు కాబట్టి..  వారి పిల్లల పేరుతో ఇండ్లు కొంటున్నారట. బిడ్డలు మైనర్లు అయితే, ట్రస్టు అకౌంట్లు ఓపెన్​చేసి మరీ ఇండ్లు కొనేస్తున్నారట. దీంతో ఆ ప్రాపర్టీ మీద సర్వ హక్కులూ పిల్లలకే దక్కుతున్నాయి.