క్యూఆర్ కోడ్ తో కరోనా కట్టడి

క్యూఆర్ కోడ్ తో కరోనా కట్టడి
  • జనం కదలికలపై ఎప్పటికప్పుడు చైనా ట్రాక్
  • మొబైల్ యాప్ ల ద్వారా హెల్త్ కోడ్స్ కేటాయింపు
  • రెడ్, ఎల్లో కోడ్స్ ఉంటే క్వారంటైన్ తప్పనిసరి
  • కరోనా సోకనివారికి గ్రీన్ క్యూఆర్ కోడ్, ట్రావెల్ కు పర్మిషన్

 

హాంకాంగ్: కరోనాను కంట్రోల్ చేయడంలో చైనా టెక్నాలజీని విస్తృతంగా వినియోగించింది. మొబైల్ టెక్నాలజీ, బిగ్ డేటా ద్వారా ప్రజల కదలికలపై నిఘా పెట్టి వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలిగింది. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారికి మొబైల్ యాప్ లలోనే క్విక్ రెస్పాన్స్ కోడ్ లు (క్యూఆర్ కోడ్ ల)ను ఇచ్చింది. రెడ్, ఎల్లో, గ్రీన్ రంగులతో కూడిన క్యూఆర్ కోడ్ లు కేటాయించింది. రెడ్ ఉంటే కరోనా ఉందని లేదా లక్షణాలు ఉన్నాయని, వారికి సెల్ఫ్ క్వారంటైన్ లేదా గవర్నమెంట్ ఆధీనంలో క్వారంటైన్ సెంటర్లలో తప్పనిసరిగా ఉండాలని సూచించింది. పసుపు రంగు కోడ్ ఉంటే కరోనా పేషెంట్ తో కాంటాక్ట్ లోకి వచ్చినవారని, వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఇక గ్రీన్ క్యూఆర్ కోడ్ ఉంటే కరోనా లేదని, వారికి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పించారు. ఈ హెల్త్ కోడ్స్ సాయంతో మూడు నెలల్లోనే వైరస్ ను చైనా కట్టడి చేయగలిగింది. క్రమంగా కంటైన్ మెంట్, లాక్ డౌన్ ను ఎత్తివేసింది.

ఎలా పని చేస్తోంది?

చైనా ప్రభుత్వం తమ దేశంలో రెండు పెద్ద ఇంటర్నెట్ సంస్థలైన అలీబాబా, టెన్సెంట్ ల సాయం తీసుకుంది. అలీబాబా మొబైల్ పేమెంట్ యాప్ అలీపే, టెన్సెంట్ మెసేజింగ్ యాప్ వియ్ చాట్ లను కోట్ల మంది వాడతారని గుర్తించింది. ఈ యాప్ ల ద్వారా హెల్త్ కోడ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ముందుగా ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. ట్రావెల్ హిస్టరీతోపాటు గడిచిన 14 రోజుల్లో కరోనా పెషెంట్లు లేదా అనుమానితులతో ఎక్కడైనా కాంటాక్ట్ అయ్యారా అన్న వివరాలను యాప్ ద్వారా అడిగి తెలుసుకుంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉంటే యాప్ లోనే టిక్ చేయాలని సూచించింది. తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ను వెరిఫై చేసి కరోనా లక్షణాలు ఉంటే రెడ్, కరోనా సోకినవారితో కాంటాక్ట్ లోకి వచ్చి ఉంటే ఎల్లో, కరోనా సోకని వారికి గ్రీన్ క్యూఆర్ కోడ్లను కేటాయించింది. ఈ యాప్ ల ద్వారా ఒక వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరెవర్నీ కాంటాక్ట్ అయ్యాడు అని కూడా ట్రాక్ చేశారు. క్యూఆర్ కోడ్ సిస్టమ్ ను లాంచ్ చేసిన వారం రోజుల్లోనే వంద సిటీల్లో అమల్లోకి తెచ్చారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేశారు.

మొదట్లో సమస్యలొచ్చినా..

ఎంత టెక్నాలజీ వాడినా, హెల్త్ యాప్ లు వాడినా కొన్ని సార్లు తప్పులు దొర్లుతుంటాయి. హెల్త్ కోడ్ సిస్టమ్ లోనూ సమస్యలు వచ్చాయి. ఒకరికి ఒక కోడ్ బదులుగా మరో కోడ్ ఇవ్వడం లాంటి పొరపాట్లుజరిగాయి. దీని వల్ల అవసరం లేని వారు కూడా క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాటిని సరిచేశారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు హెల్త్ కోడ్ లను ఆయా ప్రాంతాలు గుర్తించకపోవడం ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వలేదు. లోకల్ గవర్నమెంట్స్ డేటాను షేర్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని గుర్తించిన చైనా ప్రభఉత్వం ఎపిడెమిక్ ప్రివెన్షన్ కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే డేటా బేస్ ను అమలులోకి తెచ్చింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా తొలగిపోయిన తర్వాత డేటాను పూర్తిగా తొలగిస్తామని ప్రజలకు నచ్చజెప్పి ప్రైవసీ సమస్య నుంచి బయటపడింది.

చైనా బాటలో కొన్ని దేశాలు

చైనా తరహాలో సింగపూర్ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ స్మార్ట్ ఫోన్ యాప్ ను ప్రారంభించింది. కరోనా పేషెంట్ల కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతోంది. జపాన్ గవర్నమెంట్ కూడా ఇదే తరహా యాప్ ను వాడింది. రష్యా కూడా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ను అమలులోకి తెచ్చింది.