డ్యామ్‌‌ కూలి కెన్యాలో 42 మంది మృతి

డ్యామ్‌‌ కూలి కెన్యాలో 42 మంది మృతి

మై మహియు: కెన్యాలో ఘోరం చోటుచేసుకుంది.  సోమవారం రిఫ్ట్‌‌ వ్యాలీలోని ఓ డ్యామ్‌‌ కూలి 42 మంది చనిపోయారని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మై మహియులోని నకురు కౌంటీ ప్రాంతంలో ఉన్న డ్యామ్‌‌కు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో డ్యామ్‌‌ కూలిపోయింది. దీంతో దగ్గర్లలో ఉన్న గ్రామాల్లోకి వరద రావడంతో పలువురు కొట్టుకుపోయారు. 

ఇప్పటివరకు 42 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఇండ్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయని చెప్పారు. పలువురు బురదలో ఇరుక్కుపోగా, వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని నకురు గవర్నర్‌‌‌‌ తెలిపారు. భారీ వర్షాలకు కెన్యాలోని తానా రివర్‌‌‌‌ కౌంటీలో వరదలు ముంచెత్తడంతో ఇటీవల ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 23 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షాలకు మార్చి నుంచి ఇప్పటివరకు 76 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. 1,30,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.