ఎడారి దేశం లో భారీ వర్షాలు.. వరదల్లో మునిగిన దుబాయ్.. హైఅలెర్ట్

ఎడారి దేశం లో భారీ వర్షాలు.. వరదల్లో మునిగిన దుబాయ్.. హైఅలెర్ట్

ఎడారి దేశం UAE ని భారీ వర్షాలు ముంచెత్తాయి. అకాల వర్షాలు, వరదలతో అబుదాబి, షార్జా, దుబాయ్ వంటి ప్రధాన నగరాలలో రోడ్లు చెరువులను తలపించాయి. దేశ రాజధాని అబుదాబి రోడ్లపై మోకాల్లోతు నీళ్లు వచ్చాయి.  షార్జాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 

గత నాలుగు రోజులుగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు దుబాయ్, అబుదాబి, షార్జా సహా UAEలోని  పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. జనజీవనం స్థంభించింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి రవాణా ఎక్కడికక్కడ  నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైఅలర్ట్ ప్రకటించింది అక్కడి వాతావరణ శాఖ. 

అబుదాబి, దుబాయ్, షార్జా  నగరాల్లో శుక్రవారం(డిసెంబర్ 19)  కురిసిన భారీ వర్షాలతో  ఆకస్మిక వరదలతో వీధులన్నీ జలమయమయ్యాయి.. జనం ఇండ్లకే పరిమితం అయ్యారు. అనేక విమానాలురద్దు చేశారు. కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేశారు. అబుదాబిలో, జాయెద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు హై అలర్ట్‌లో ప్రకటించారు.  ప్రయాణికులను ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు  ఎయిర్ పోర్ట్ అధికారులు. బీచ్ లు, పార్కులు, టూరిస్టు ప్లేస్ లను మూసివేశారు. ప్రభుత్వ  సంస్థలకు సెలవులు ప్రకటించారు. 

శుక్రవారం దుబాయ్ అంతటా ముఖ్యంగా తీరప్రాంతం, ఉత్తర, తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే మూడురోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని  అక్కడి నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (ఎన్‌సిఎం) హెచ్చరించింది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని,  ఉష్ణోగ్రతలు తగ్గి సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.