మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు

మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు
  • ఇండియన్ హైకమిషన్ ఆఫీసుపై రాళ్ల దాడి
  • మూడు దినపత్రికల కార్యాలయాలు ధ్వంసం 
  • దైవ దూషణ పేరుతో హిందూ యువకుడిపై దాడి 
  • కొట్టి చంపి, హైవేపై తగులబెట్టిన అల్లరిమూక 
  • హింసాత్మక ఘటనలను ఖండించిన యూనస్ ప్రభుత్వం

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమన్నది. గతేడాది జులైలో షేక్ హసీనా సర్కారును గద్దె దింపడం వెనక కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్, ‘ఇంక్విలాబ్ మంచ్’ కన్వీనర్ షరీఫ్​ఉస్మాన్ హాదీ(32) హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆరు రోజుల కిందట ఢాకాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. 

తీవ్రంగా గాయపడిన అతడు సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. హాదీ మరణంతో గురువారం రాత్రి రాజధాని ఢాకాలో అతడి మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇండియన్ ఆఫీసులపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల అల్లరిమూకలు విధ్వంసానికి దిగారు. మరోవైపు.. దైవ దూషణకు పాల్పడ్డాడంటూ ఓ హిందూ యువకుడిని అల్లరిమూకలు కొట్టి చంపి, తగులబెట్టడం కూడా తీవ్ర సంచలనం రేపింది. 

ఒకవైపు భారత రాయబార కార్యాలయాలపై, పత్రికా ఆఫీసులపై దాడులు జరగడం.. మరోవైపు హిందూ యువకుడి మూకహత్య నేపథ్యంలో ఆ దేశంలోని హిందూ మైనార్టీలు మళ్లీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

యూనస్ ప్రకటన తర్వాత..

సింగపూర్ లో ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న హాదీ చనిపోయాడంటూ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ గురువారం రాత్రి ప్రకటన చేశారు. హాదీ హంతకులను పట్టుకుని, శిక్షిస్తామన్నారు. దేశ ప్రజలంతా సహనంతో ఉండాలని కోరారు. హాదీ మృతి పట్ల సంతాప సూచకంగా శనివారం సెలవును ప్రకటించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో హాదీ ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేయాలన్నారు. 

అలాగే గురువారం రాత్రి జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యపైనా యూనస్ స్పందించారు. ఇది కొత్త బంగ్లాదేశ్ అని, ఇలాంటి హింసాత్మక ఘటనలను సహించబోమని హెచ్చరించారు. అయితే, యూనస్ ప్రకటన తర్వాత ఢాకా, తదితర ప్రాంతాల్లో అల్లరిమూకలు రెచ్చిపోయారు. దీంతో శుక్రవారం కూడా యూనస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రజలంతా సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేసింది. 

ఇండియన్ హైకమిషనర్ నివాసంపై రాళ్లదాడి.. 

ఛత్తోగ్రామ్​లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై గురువారం రాత్రి ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసి అల్లరిమూకను చెదరగొట్టారు. రాజ్ షాహీ సిటీలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఆఫీసును ధ్వంసం చేశారు. 

ఢాకాలోని ఛయ్యానాట్ కల్చరల్ గ్రూప్ ఆఫీసుకు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ప్రోథోమ్ ఆలో, డైలీ స్టార్ దినపత్రికల ఆఫీసులపై కూడా ఆందోళనకారులు దాడులు చేసి, నిప్పు అంటించారు. దీంతో చాలా మంది జర్నలిస్టులు లోపలే చిక్కుకుపోయారు. గురువారం రాత్రి హాదీ మృతి పట్ల ఢాకా యూనివర్సిటీ క్యాంపస్ లో నేషనల్ సిటిజన్ పార్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హాదీని హత్య చేసిన దుండగులు ఇండియాకు పారిపోయారని, వారిని తిరిగి అప్పగించేంత వరకూ ఇండియన్ హై కమిషన్ ఆఫీసును మూసేయాలని డిమాండ్ చేశారు. బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇల్లు ‘32 ధన్ మండి’పై శుక్రవారం మరోసారి దాడి చేశారు. 

చరిత్రాత్మకమైన ఈ ఇంటిని ఇదివరకే పలుసార్లు ధ్వంసం చేసి, నిప్పు పెట్టిన నిరసనకారులు.. తాజాగా మరోసారి ధ్వంసం చేశారు. ఈ అల్లర్లు, హింసాకాండను మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఖండించింది. దీనికి యూనస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. 

ఢాకాకు హాదీ డెడ్ బాడీ.. నేడు అంత్యక్రియలు 

హసీనా సర్కారును గద్దె దింపడంలో ఇంక్విలాబ్ మంచ్ కీలక పాత్ర పోషించినా.. దానిని రాజకీయ పార్టీగా గుర్తించేందుకు యూనస్ ప్రభుత్వం నిరాకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో హాదీ ఢాకాలోని ఓ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఈ నెల 12న ఎన్నికల ప్రచారం కోసం బిజోయ్ నగర్ ఏరియాలో ఆటోలో వెళ్తుండగా అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. 

కాగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సింగపూర్ నుంచి హాదీ డెడ్ బాడీని ప్రత్యేక విమానంలో ఢాకాకు తీసుకొచ్చారు. హాదీ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢాకాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

హిందూ యువకుడిని కొట్టి చంపి, తగులబెట్టారు

బంగ్లాదేశ్ లో స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో ఒకవైపు అల్లర్లు చెలరేగగా.. మరోవైపు దైవ దూషణకు పాల్పడ్డాడంటూ ఓ హిందూ యువకుడిని అల్లరిమూక కొట్టి చంపి, తగులబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మైమెన్ సింగ్ సిటీలో ఫ్యాక్టరీ వర్కర్​గా పనిచేస్తున్న దీపు చంద్ర దాస్ (25) అనే హిందూ యువకుడిపై గురువారం రాత్రి సిటీలోని ఫ్యాక్టరీ గేటు ముందు అల్లరిమూక దాడి చేసినట్టు బంగ్లా ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది.

 దీపు చంద్రను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టి చంపిన అల్లరిమూకలు.. తర్వాత డెడ్ బాడీని ఓ చెట్టుకు వేలాడదీసి కొడుతూ భారత వ్యతిరేక నినాదాలు చేశారని తెలిపింది. అనంతరం డెడ్ బాడీని హైవే మీద తగులబెట్టినట్టు పేర్కొంది. కాగా, ఈ ఘటనను యూనస్ సర్కారు శుక్రవారం తీవ్రంగా ఖండించింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది.