జీ రామ్‌‌ జీ.. గ్రామ వ్యతిరేక బిల్లు..రాష్ట్రాలకూ వ్యతిరేకమే: రాహుల్‌‌

జీ రామ్‌‌ జీ.. గ్రామ వ్యతిరేక బిల్లు..రాష్ట్రాలకూ వ్యతిరేకమే: రాహుల్‌‌
  • స్టాండింగ్‌‌ కమిటీకి పంపకుండా అప్రూవ్‌‌ చేశారు
  • ఉపాధిని తగ్గించేందుకు కుట్ర
  • ఈ చట్టం వెనక్కి తీసుకునేలా జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని వెల్లడి

న్యూఢిల్లీ: పార్లమెంటులో తాజాగా ఆమోదం పొందిన ‘వికసిత్‌‌ భారత్‌‌ గ్యారెంటీ ఫర్‌‌ రోజ్‌‌గార్‌‌ అండ్‌‌ అజీవికా మిషన్‌‌ (గ్రామీణ్‌‌)’ (వీబీ-జీ రామ్‌‌ జీ)  బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు  ‘రాష్ట్రాల వ్యతిరేక’, ‘గ్రామ వ్యతిరేక’ బిల్లు అని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోకుండా ఆమోదించడంపై మండిపడ్డారు. 

శుక్రవారం సోషల్​మీడియా వేదికగా మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. ‘‘నిన్న రాత్రి మోదీ ప్రభుత్వం ఒక్క రోజులో 20 ఏండ్ల ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్​ ఎంప్లాయిమెంట్‌‌ గ్యారెంటీ స్కీమ్’​ చరిత్రను ధ్వంసం చేసింది.  జీ రామ్​ జీ అనేది హక్కు, డిమాండ్- ఆధారిత హామీని నాశనం చేసి, ఢిల్లీ నుంచి నియంత్రించే రేషన్ స్కీమ్‌‌గా మారుస్తున్నది. దీని నిర్మాణమే రాష్ట్రాలకు, గ్రామాలకు వ్యతిరేకం” అని వ్యాఖ్యానించారు.

 పని దినాలను 125 రోజులకు పెంచుతున్నట్లు చెబుతున్నప్పటికీ, నిబంధనల పేరుతో ఉపాధిని తగ్గించే మార్గాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని, దీనివల్ల దళితులు, ఆదివాసీలు, మహిళలు, వెనుకబడిన తరగతుల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని  పేర్కొన్నారు.

ప్రతిపక్షాల డిమాండ్‌‌ను పట్టించుకోలే..

బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండానే పార్లమెంట్‌‌లో ఆమోదించారని రాహుల్‌‌గాంధీ మండిపడ్డారు. ‘‘ఈ చట్టాన్ని సరైన పరిశీలన లేకుండానే పార్లమెంటులో ఆమోదించారు. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలనే ప్రతిపక్ష డిమాండ్‌‌ను తిరస్కరించారు. కోట్లాది మంది కార్మికులను ప్రభావితం చేసే గ్రామీణ సామాజిక ఒప్పందాన్ని తిరిగి మార్చే ఈ చట్టాన్ని కమిటీ పరిశీలన, నిపుణుల సంప్రదింపులు, బహిరంగ విచారణలు లేకుండా అమలు చేయొద్దు” అని అన్నారు. 

కొవిడ్‌‌ సమయంలో ఉపాధి హామీ పథకం కోట్లాది మందిని ఆకలి తీర్చిందని చెప్పారు. ఉపాధి హామీ వల్ల గతంలో దోపిడీ, వలసలు తగ్గాయని, కానీ కొత్త చట్టంతో దళితులు,  ఆదివాసీలు, బీసీలు, మహిళలు  తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.  ఉపాధిని పరిమితం చేయడం వల్ల వారంతా మొదటి బాధితులుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, పంచాయతీలు, రాష్ట్రాలతో కలిసి కొత్త చట్టాన్ని ఉపసంహరించేందుకు జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు.