నాంపల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత!

నాంపల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత!
  • దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

బషీర్​బాగ్, వెలుగు: ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం, సురక్షితమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్​లో బేగంపేట వైపు ఉన్న పాత పాదచారుల వంతెనను కూల్చివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రెడ్ హిల్స్ ప్రాంతాన్ని పబ్లిక్ గార్డెన్​తో కలిపే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్టేషన్​లోని ఏ ప్లాట్​ఫామ్‌కూ అనుసంధానంగా లేకపోవడం గమనార్హం. సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 

రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండటంతో రైలు కార్యకలాపాలకు, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలను నివారించేందుకు డిసెంబర్ 20 నుంచి 23 మధ్య ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కూల్చివేత పనుల సమయంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని, అవసరమైతే రైలు కార్యకలాపాలను నియంత్రిస్తామని స్పష్టం చేసింది.