నిర్మల్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని, ఇక అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లను శుక్రవారం ఎమ్మెల్యే, బీజేఎల్పీ మహేశ్వర్‌రెడ్డితో కలిసి నిర్మల్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రామచందర్‌రావు మాట్లాడారు.
నిజామాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రూ. 5 వేల కోట్లతో రైల్వే లైన్ ఏర్పాటు కాబోతోందని, కేంద్రం ఇప్పటికే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టిందని చెప్పారు. కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించి అనేక పథకాలు మంజూరు చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ బలంగా విస్తరిస్తోందన్నారు. సర్పంచ్‌ల లెక్కల్లో కాంగ్రెస్ తప్పుడు వివరాలు చూపుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి జారీ చేసిన ప్రకటన తప్పుల తడక అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు ఒకటే ఎజెండాతో పని చేస్తున్నాయన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పాల్గొన్నారు.
