ఉపాధి హామీ పథకం ఎత్తివేసే కుట్ర : కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్

ఉపాధి హామీ పథకం ఎత్తివేసే కుట్ర : కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్
  •     ఖానాపూర్ లో గాంధీ విగ్రహం  ఎదుట సీపీఎం నిరసన

ఖానాపూర్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ ఆరోపించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా నూతన్​ కుమార్​ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో ఉన్న మహత్మా గాంధీ పేరును తొలగించి, విబీజీ రాంజీగా మార్చడం సిగ్గుచేటని అన్నారు. అలాగే పాత చట్టం స్థానంలో కొత్త బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడం సరికాదన్నారు. గతంలో 90 శాతం ఉపాధి హామీ నిధులను కేంద్రం భరించగా రాష్ట్రం 10 శాతం మా త్రమే  సమకూర్చేదని, కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించాల్సి వస్తుందన్నారు. 

ఫలితంగా రాష్ట్రాలపై అదనపు భారం పడి పథకం నీరు గారే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు నర్సయ్య, తిరుపతి, నారాయణ, శ్రీనివాస్, విలాస్, పోశ లింగం తదితరులున్నారు.