- పంచాయతీ ఎన్నికల్లో జోరుగా మద్యం అమ్మకాలు
- గతేడాది డిసెంబర్ నెల మొత్తం అమ్మకాల విలువ రూ.88 కోట్లు
- ఈసారి మందు వ్యాపారులకు జాక్‌పాట్
నిజామాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో మందు ఏరులై పారింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఖుషీ చేసేందుకు భారీగా లిక్కర్ పంచారు. బీర్ బాటిళ్ల అమ్మకాలు సాధారణం కంటే 1.43 తగ్గగా, బ్రాందీ, విస్కీ సేల్స్ 78.17 శాతం పెరిగాయి. 151 వైన్స్, 28 బార్లలో ఉమ్మడి జిల్లాలో ఈనెల 19 వరకు రూ.157. 29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ నెలలో రూ.88.28 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగగా, ఈ నెల కేవలం 19 రోజుల్లోనే రికార్డును బ్రేక్చేశారు.
నామినేషన్ల నుంచే జోరుగా అమ్మకాలు..
జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు వేసిన నామినేషన్ల స్క్రూటినీ, విత్‌డ్రా తరువాత ఫైనల్ లిస్టు వచ్చిన రోజు నుంచి లిక్కర్ దందా జోరందుకుంది. 86 మంది సర్పంచులు, 1,739 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, మందు దావత్ లు జోరుగా సాగాయి. మిగతా 459 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా 1,654 మంది సర్పంచ్అభ్యర్థులు పోటీ చేశారు. ఏకగ్రీవాలు మినహాయించి 3,271 వార్డులకుగాను 8,722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బోధన్, నిజామాబాద్ డివిజన్లోని పది వార్డులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఉప సర్పంచ్ పదవి కోసం వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్‌కు ముందు రోజు వరకు ఓటుకు క్వాటర్ చొప్పున పంచారు. కుల సంఘాలు, గ్రామ పెద్దలకు ఖరీదైన లిక్కర్ సప్లయ్ చేశారు. ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థులు అందులో రూ.4 లక్షలు మందు దావత్‌లకు పెట్టడం విశేషం.
బీర్ బాటిళ్లు, క్వాటర్లు..
చలి తీవ్రత వల్ల ఎన్నికల్లో బీర్ బాటిల్స్కంటే లిక్కర్ సీసాలకే జనం జైకొట్టారు. ఓటర్ల ఇష్టం మేరకు మద్యాన్ని పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 151 వైన్స్, 28 బార్లకు లిక్కర్ సప్లయ్ చేసే ఐఎంఎల్ డిపో ఇందూర్ జిల్లాలోని మాక్లూర్ మండలంలో ఉంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు 2,98,074 కేసుల మందు సప్లయ్ చేశారు. అందులో 1,59,541 కేసులు లిక్కర్కాగా మిగతావి బీర్ సీసాలు ఉన్నాయి. ఈనెల మిగతా 11 రోజుల్లో రోజుకు రూ.4.87 కోట్ల చొప్పున లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా.
గతేడాది డిసెంబర్ నెల మొత్తం కలిపి 2,31,588 కేసులు మందు అమ్ముడుపోయింది. కొత్తగా వైన్స్ టెండర్లు, బార్ లైసెన్స్‌లు పొంది డిసెంబర్ 1 బిజినెస్ షురూ చేసిన వ్యాపారులకు పంచాయతీ ఎన్నికలు జాక్ పాట్‌గా మారాయి. అభ్యర్థులు రూ.కోట్లలో డబ్బు ఖర్చు చేయగా, ఓటర్లు నిషాలో తూగారు.
