రక్త దాతలకు 'చిరు భద్రత' కార్డుల పంపిణీ

రక్త దాతలకు 'చిరు భద్రత' కార్డుల పంపిణీ

రక్తదానం చేయడం అంత చిన్న విషయమేం కాదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారికి రాజ్ భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా 'చిరు భద్రత' పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ...చిరంజీవి తన అభిమానులను మోటివెట్ చేసి  బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని.. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు రియల్ మెగా స్టార్ అని గవర్నర్ ప్రశంసించారు. రక్త దానం దాతలను సన్మానించుకోడం సంతోషంగా వుందన్న ఆమె... ప్రతి రక్త దాత ఒక స్టార్ అని అభివర్ణించారు.  తాను హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నపుడు రక్తం ఇచ్చేందుకు తమ కుటుంబసభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశానన్నారు. రక్తదానం చేసే వాళ్లలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందన్న  ఆమె... బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవ చేస్తోన్న చిరంజీవికి గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాజ్ భవన్ తరపునా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని, అవసరమైన వారికి రక్తం అందించేందుకు యాప్ ను సైతం రూపొందించామని తెలిపారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్  సైతం అందులో భాగం కావాలని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై చిరంజీవిని కోరారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ... రక్తం లేక ప్రమాదాలలో చనిపోతున్న వారిని చూసి షాక్ అయ్యి 24 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్ ను స్థాపించానన్నారు. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు  తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ గారి అమృత హస్తాల మీద ప్రారంభించడం ఆనందంగా వుందని చిరంజీవి అన్నారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్ ఎంకరేజ్ మెంట్ ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. 1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది చనిపోయారని.. ఆ ఘటనలే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. తరచూ 2, 3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్న ఆయన.. వారికి ఏదైనా భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే  'చిరు భద్రత' అనే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, అందులో 70శాతం పేదలకు, మిగిలినది ప్రైవేటు ఆస్పత్రులకు చేరవేశామని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య చాలా తగ్గిందన్న ఆయన.. రక్తదానం చేసేవారికి చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.