హైదరాబాద్లో చిత్రగుప్తుడి గుడి...మరి నగర ప్రజల పాపపుణ్యాలెన్ని..?

హైదరాబాద్లో చిత్రగుప్తుడి గుడి...మరి నగర ప్రజల పాపపుణ్యాలెన్ని..?

యమలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్క కట్టే చిత్రగుప్తుడు భాగ్యనగరంలో కొలువుదీరాడు. యమధర్మరాజు ఆస్థానంలో అసీనుడయ్యే చిత్రగుప్తుడు..హైదరాబాద్లో పూజలందుకుంటున్నాడు. ఫలక్ నామా, కందికల్ గేటు దగ్గర ఉన్న చిత్రగుప్తుడి దేవాలయం..దేశంలోని చిత్రగుప్తుడి ఆలయాల్లో ప్రత్యేకమైంది. 

250 ఏళ్ల చరిత్ర..

చిత్రగుప్తుడికి సౌతిండియాలో రెండు ఆలయాలున్నాయి. అందులో ఒకటి  తమిళనాడు కంచిలో ఉండగా...మరొకటి మన రాష్ట్రంలో అదీ హైదరాబాద్లో ఉండటం విశేషం. ఫలక్ నామాలోని కందికల్ గేటు దగ్గర చిత్రగుప్తుడి మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి  250 ఏళ్ల చరిత్ర కలదు. ఈ  దేవాలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించింది. భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసంగా స్థానికులు చెబుతుంటారు.

 

గుమాస్తాల ఆరాధ్యదైవం...

18వ శతాబ్దంలో చిత్రగుప్తుడి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో కొలువైన చిత్రగుప్తుడిని నిజాం నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా పూజించేవారు.  కాయస్థ వంశీయుడైన  అప్పటి నిజాం ప్రభుత్వంలోని మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ గుడిని కట్టించారు. అయితే కాలక్రమేణా ఆ వంశస్తులు అంతరించిపోవడం వల్ల  ఈ ఆలయం నిరాదరణకు గురైంది. అయితే 1980లో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. గుడి విశిష్టత తెలుసుకుని వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. క్రమ క్రమంగా ఆలయం అభివృద్ధి చెందింది. దాతల సాయంతో చిత్రగుప్తుడి చెంతనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు. 

ఇద్దరి భార్యలతో విగ్రహం..

చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సూర్య దక్షిణ నందిని, మరొక భార్య పార్వతీ శోభావతి. సూర్యదక్షిణికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. రెండవ భార్య పార్వతీ శోభావతికి ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు. అయితే హైదరాబాద్లో ఉన్న చిత్రగుప్తుడి ఆలయంలో  ఇద్దరు భార్యలతో ఉన్న చిత్రగుప్తుని విగ్రహం పూజలందుకుంటోంది. 

నిత్య పూజలు..

కందికల్ గేటు దగ్గర గల చిత్రగుప్తుడి ఆలయంలో  మరణాన్ని జయించటానీకే కాదు ....ఆరోగ్యం, సంతానం, చదువు, పెళ్లి వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం చిత్రగుప్తుడిని దర్శించుకుంటారు. ముఖ్యంగా బుధవారం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆ రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.  కేతు గ్రహ దోష నివారణ కోసం భక్తులు ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ  ఆలయంలో 7 వారాలపాటు క్రమం తప్పకుండా పూజలు  చేస్తే పలు  సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. చిత్రగుప్తుడి పూజ కోసం భక్తులు తెచ్చే సామాగ్రిలో  పెన్ను, పేపరు, ఇంక్‌, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు తప్పక ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం వంటి గుణాలు పొందడానికి ఈ సామాగ్రిని చిత్రగుప్తుడి వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తారు.