చీకటిలో చిట్యాల.. హైవేపై వెలుగని స్ట్రీట్లైట్లు!

చీకటిలో చిట్యాల.. హైవేపై వెలుగని స్ట్రీట్లైట్లు!

చిట్యాల, వెలుగు: చిట్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-65పై ఏడాది కాలంగా వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పేరుతో విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో ఈ పరిస్థితి ఉంది. పనులు జరుగుతున్న చోటే కాకుండా సర్వీస్ రోడ్లు, పనులు లేని ఇతర ప్రాంతాల్లో కూడా దీపాలు వెలగకపోవడం గమనార్హం. 

రాత్రివేళల్లో కటిక చీకటి కారణంగా ఈ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఫ్లైఓవర్ పనులు లేని ప్రాంతాల్లోనైనా వీధి దీపాలను పునరుద్ధరించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.